Special Investigation Team: ఏపీ డీజీపీకు సిట్ నివేదిక ! సిట్‌ నివేదికలో కీలక అంశాలు ఇవే !

ఏపీ డీజీపీకు సిట్ నివేదిక ! సిట్‌ నివేదికలో కీలక అంశాలు ఇవే !

Special Investigation: ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్‌ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు అందించింది. సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఈ నివేదికను డీజీపీకి అందజేశారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం… నిన్న అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్‌ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలకాంశాలను పొందుపరిచింది.

పల్నాడు, తిరుపతి(Tirupati), అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు గుర్తించారు. పల్నాడు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు, తిరుపతి జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాల్లో 4 కేసులు నమోదైనట్లు సిట్‌ వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పోలీసులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి సాక్ష్యాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు పేర్కొంది. 33 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం 1,370 మంది నిందితులుగా ఉన్నారని, ఇప్పటి వరకు 124 మంది అరెస్టయ్యారని తెలిపింది. మిగతావారిని కూడా అరెస్ట్‌ చేయాలని సూచించింది. రెండు వర్గాల ఘర్షణలు మరణాలకు కారణమై ఉండేవని తేల్చింది. కేసుల దర్యాప్తులోనూ తీవ్ర లోపాలు గుర్తించినట్లు సిట్‌ తన నివేదికలో పేర్కొంది.

మరోవైపు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైనా సిట్‌ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలా? వద్దా అనే అంశంపైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హింస జరుగుతుందని తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా సిట్‌ నిర్థరించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా… మిన్నకుండిపోయారని ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు పోలీస్‌ అధికారులపైనా కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామగ్రికి సంబంధించిన ఆధారాలూ సేకరించిన సిట్‌… ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైనా కొన్ని సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై పూర్తి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్‌ కోరే అవకాశం ఉంది. ఈ నివేదికను సీఎస్‌ జవహర్‌ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.

Special Investigation – సిట్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు

పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై సిట్ అధికారులకు వైసీపీ(YCP) నేతలు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని సిట్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మల్లాది విష్ణు, కైలా అనిల్ కుమార్, ఏళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.

Also Read : Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ ! కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం !

Leave A Reply

Your Email Id will not be published!