Kesineni Nani: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేశినేని నాని ! నానిపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు !
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేశినేని నాని ! నానిపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు !
Kesineni Nani: సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి… విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన కేశినేని నాని(Kesineni Nani) రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. నేటితో తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి కృషిచేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Kesineni Nani – నానిపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు
మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా నానిపై వెంకన్న వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘అయ్యా కేశినేని నాని నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, ప్రజలే నిన్ను తప్పించారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే నిన్ను ఒక్కడినే విజయవాడ ప్రజలు ఓడించడం మరొక ఎత్తు.. 2సార్లు నిన్ను పార్లమెంట్‌కు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు గారిని పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. కనీసం నిన్ను 2సార్లు పార్లమెంట్‌కు పంపిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పావా…? అలాగే 2వ సారి నువ్వు గెలిచినప్పుటి నుంచి నీ మాటలతో చంద్రబాబును బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలి’’ అని బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Etela Rajender: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?