Ganta Srinivas Rao: రుషికొండపై నిర్మించిన భవనాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా !
రుషికొండపై నిర్మించిన భవనాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా !
Ganta Srinivas Rao: వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హాయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన విలాస వంతమైన భవనాలను భీమిలి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు(Ganta Srinivas Rao) పరిశీలించారు. వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత రుషికొండపై ఉన్న ఏపీ టూరిజంకు సంబంధించిన భవనాలను కూల్చి వేసి వాటి స్థానంలో ఓ రాజమహల్ ను నిర్మించారు. సీఎం నివాసం, సీఎం క్యాంప్ ఆఫీస్, టూరిజం రిసార్ట్ అంటూ పొంతనలేని సమాధానాలు చెప్తూ ఐదేళ్ళుగా చాలా రహస్యంగా ఆ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ధర్నాలు చేసిన, కోర్టులకు వెళ్లినా సరే అటువైపుగా ఎవ్వరినీ వెళ్ళనీయకుండా నిర్మాణాలు పూర్తి చేసారు. అంతేకాదు వైసీపీ రెండో సారి అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ ప్యాలెస్ నుండి జగన్ పరిపాలన కొనసాగిస్తారని హాడావుడిగా ప్రారంభోత్సవాలు కూడా పూర్తి చేసారు. అయితే ఇటీవల ఎన్నికల్లో వైసీపీకు ఘోర పరాభవం ఎదురుకావడంతో… ఆ రాజమహాల్ గుట్టు విప్పడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ భవనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు(Ganta Srinivas Rao) మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టారు. ముందు పర్యాటకం అన్నారు.. తర్వాత పరిపాలన భవనాలు అన్నారు. రూ.450 కోట్ల ప్రజాధనం ఏం చేశారు?. వైసీపీ నాయకులకే ఈ కాంట్రాక్టు ఇచ్చారు. రుషికొండ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం. ఈ భవనాల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రుషికొండ భవనాల నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారు. ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను అనుమతులు లేవనే కారణంతో జగన్ సర్కార్ కూల్చివేసింది. రుషికొండ భవనానికి ఏ అనుమతులు ఉన్నాయి..? ఎవరినీ అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి ప్రారంభించారు. ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు నిర్మించారు?’’ అని గంటా ప్రశ్నించారు.
Ganta Srinivas Rao – రాజ్‌మహల్ రహస్యం బట్టబయలైంది!
‘‘రుషికొండ(Rushikonda)పై గత ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన రాజ్‌మహల్ రహస్యం తెలుసుకోవాలనే ఆతృత, ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే ఇవాళ ఆ భవనాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించాం. రాజ్‌మహల్ రహస్యం బట్టబయలైంది. రుషి కొండపై ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. అక్కడికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిపై అక్రమ కేసులు పెడితే వారు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ప్రభుత్వం ఏదైనా నిర్మాణం చేపడితే అందులో రహస్యాలు ఉండవు. ఆ భవనం ఎందుకోసం, ఎంత విస్తీర్ణంలో కడుతున్నారనే పూర్తి వివరాలు ప్రకటిస్తారు. కానీ, అందుకు భిన్నంగా.. అత్యంత గోప్యంగా రుషికొండపై భవనాలు నిర్మించారు. దేశంలో ఇప్పటి వరకు నిర్మించిన ఏ ప్రభుత్వ భవనాలు కూడా ఇంత వివాదాస్పదం అయి ఉండవు. టూరిజం కోసం ఒకసారి, ఫైవ్ స్టార్ హోటల్ అని మరోసారి, కాదు.. సీఎం క్యాంపు కార్యాలయం అని చెప్పి.. వెబ్సైట్లో పెట్టి కూడా డిలీట్ చేశారు. అంచనాలు కూడా చాలా గోప్యంగా ఉంచారు.
ప్రజావేదిక కూల్చివేసినప్పుడు జగన్ చెప్పిన కారణం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రజా వేదిక భవనానికి అనుమతులు లేవు, చట్ట విరుద్ధంగా అనుమతిచ్చారని చెప్పి ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చి వేసింది. రుషికొండ(RushikondaRushikonda)పై జగన్ నిర్మించిన రాజ్‌మహల్‌కు ఏం అనుమతులు ఉన్నాయో అందరూ ఆలోచించాల్సిన అవసరముంది. టూరిజం తరఫున నిర్మాణాలు చేపట్టామని న్యాయస్థానాలను కూడా బురిడీ కొట్టించే విధంగా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పర్యాటకశాఖ మంత్రి అత్యంత గోప్యంగా నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సద్దాం హుస్సేన్, బెంగళూరులో గాలి జనార్థన్లాంటి వారి విలాసవంతమైన భవనాల్లోనే అధునాతన వసతులు ఉన్నట్టు మీడియాలో చూసేవాళ్లం. ప్రస్తుతం రుషికొండపై ఉన్న భవనాల్లో వాటిని తలదన్నే విధంగా వసతులు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.450 కోట్లు వెచ్చించి విలాసవంతమైన భవనం నిర్మించినా ఒక్కసారి కూడా చూడకుండానే జగన్ సీఎం పదవి నుంచి దిగి పోయారు’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.
Also Read : Palla Srinivasarao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు !