YSRCP Office: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత !

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత !

YSRCP Office: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టడంతో కూల్చివేసినట్లు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటలకే పార్టీ కార్యాలయం ఆవరణకు చేరుకున్న మున్సిపల్ అధికారుల బృందం… గంటల వ్యవధిలోనే నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని నేట మట్టం చేసారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం గత ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీ(YSRCP)కు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు శుక్రవారం హై కోర్టును ఆశ్రయించినప్పటికీ… శనివారం ఉదయాన్నే పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసారు.

YSRCP Office Demolish..

తాడేపల్లిలో 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు చెందిన స్థలాన్ని పార్టీ కార్యాలయానికి గత ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలంను ఇరిగేషన్ అధికారులు అప్పగించకుండానే నిర్మాణాలు చేపట్టారని, అంతేకాదు నిర్మాణానికి ప్లాన్ కు కూడా అనుమతులు లేవని మున్సిపాలిటీ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతుందని… ఎన్డీఏ కూటమి అధికారంలోనికి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ధర్మం, న్యాయం కనుమరుగైపోయిందని… కూల్చివేతలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆరోపించారు.

2 ఎకరాల్లో భవనాలు కట్టి… మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసి… ఏ ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. వైసీపీ కబ్జాలపై టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు. దీనితో ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు.

మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా అక్రమంగా నిర్మించిన వైసీపీ(YSRCP) పార్టీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేసారు. విశాఖపట్నంలోని ఎండాడలో సుమారు రెండెకరాల్లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయానికి కూడా ప్లాన్ అప్రూవల్ లేదంటూ నోటీసులు జారీ చేసారు. అయితే పార్టీ కార్యాలయానికి అధికారులు అంటించిన నోటీసులను మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తొలగించారు. మచిలీపట్నంతో పాటు పలు చోట్ల కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.

Also Read : Chintakayala Ayyannapatrudu: అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ! ‘ఈటీవీ’పై ఉన్న ఆంక్షలు రద్దు చేస్తూ తొలి సంతకం !

Leave A Reply

Your Email Id will not be published!