NEET UG Counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా !
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా !
NEET UG Counselling: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు తెలిసిందే. నీట్ యూజీ 2024(NEET UG 2024) పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దీనితో నీట్ నిర్వహణ దేశ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో నీట్ యూజీ కౌన్సెలింగ్ ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం (జులై 6) నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా… తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. కాగా.. నీట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
NEET UG Counselling Update
ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024(NEET UG Counselling 2024) పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి.
దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం… కౌన్సెలింగ్ వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థులను తోసిపుచ్చింది. మరోవైపు, సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అక్రమాల ఆరోపణలపై కేంద్రం, ఎన్టీఏ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్లు సమర్పించాయి. నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై జులై 8న తదుపరి విచారణ జరగనుంది. ఈ పరిణామాల వేళ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడం గమనార్హం.
Also Read : MLA Amarnath Reddy : మాజీ మంత్రి బొత్స ట్వీట్ కు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి