AP Budget: రూ.1.30 లక్షల కోట్లతో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ! గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్
రూ.1.30 లక్షల కోట్లతో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ! గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్
AP Budget: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నాలుగు నెలలకు రూ.1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్సు జారీకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్ లైన్ లో తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని గవర్నర్ కు పంపి ఆమోదం పొందాక ఆర్డినెన్సు జారీ చేస్తారు. ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందుతారు. శాసనసభకు 2024 మేలో ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అప్పట్లో వైసీపీ(YCP) ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టి తొలి నాలుగు నెలలకు ఆమోదం పొందింది. ఏప్రిల్, మే, జూన్, జులైలకు రూ.1,08,052.33 కోట్లకు వైకాపా ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్‌కు ఆమోదం పొందింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ శాసనసభకు సమర్పించాల్సి ఉంది.
AP Budget…
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి ముఖచిత్రం తెలుసుకుని ఆ తర్వాతే బడ్జెట్ ఆమోదింపజేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం వెలువరించారు. ఇంకా కొంత సమాచారం వెలికి తీస్తున్నామనీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆలస్యమైంది. పాత ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ గడువు జులై 31తో ముగుస్తోంది. ఆగస్టు నుంచి కొత్త ఖర్చులకు ప్రభుత్వం బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల కోసం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌కు సంబంధించి ఆర్డినెన్సు జారీ చేస్తున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు, రహదారుల మరమ్మతులు, పోలవరం పనులు, కొన్ని పెండింగు బిల్లుల చెల్లింపులకు సంబంధించీ ఓట్ ఆన్ ఎకౌంట్లో ఆమోదం పొందనున్నట్లు సమాచారం. తదుపరి సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
Also Read : Suryakumar Yadav : నిన్న జరిగిన శ్రీలంక టీ20 మ్యాచ్ లో ఓ అరుదైన ఘనత సాధించిన స్కై