Punjab CM Bhagwant Mann: పారిస్ ఒలింపిక్స్ కు పంజాబ్ సీఎంకు అనుమతి నిరాకరణ !
పారిస్ ఒలింపిక్స్ కు పంజాబ్ సీఎంకు అనుమతి నిరాకరణ !
Punjab CM: పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటుతున్న భారత హాకీ జట్టుకు దగ్గరుండి మద్దతు తెలపాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భావించారు. ఇందుకోసం పారిస్ పర్యటనకు అనుమతి కోరగా… కేంద్రం అందుకు నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేమని చెప్పినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి.
దౌత్య పాస్ పోర్టు కలిగిన భగవంత్ మాన్(Punjab CM) నేటినుంచి ఆగస్టు 9వ తేదీ వరకు పారిస్ పర్యటన చేపట్టేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కార్యాలయం శుక్రవారం సాయంత్రం కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించి అనుమతులు కోరింది. సీనియర్ రాజకీయ నాయకుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తప్పనిసరి. అయితే, సీఎం మాన్ కు జడ్ ప్లస్ భద్రత ఉండటంతో… ఇంత తక్కువ సమయంలో ఆయనకు పారిస్‌లో ఆ స్థాయి భద్రత కల్పించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఒలింపిక్స్ లో జోరుమీదున్న భారత హాకీ జట్టు మరోసారి అదరగొట్టింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి.. క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్(Punjab CM) ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ఆగస్టు 4న మన జట్టు క్వార్టర్స్ మ్యాచ్ జరగనుంది.
భారత్ నుంచి ఒలింపిక్ కంటెంజెంట్లో పంజాబ్‌కు చెందిన 19 మంది ఆటగాళ్లు ఉన్నారు. హాకీ జట్టులో పది మంది క్రీడాకారులు మన రాష్ట్రానికి చెందినవారు. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. అయితే ప్యారిస్ వెళ్లడానికి అనుమతి కోసం దరఖాస్తు చేయడంలో మా అధికారులు ఆలస్యం చేశారు, అయితే హాకీ జట్టు ప్రారంభ మ్యాచ్ లను క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మేము వారిని ఉత్సాహపరిచేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే తనకు అనుమతి నిరాకరించడంపై మాన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ సమాఖ్య విధానంపై బీజేపీ నిరంతరం దాడి చేస్తోందని విమర్శించారు. 2022లోనూ సింగపూర్ వెళ్లేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ప్రస్తావించారు. గత ఏడాది గోపాల్ రాయ్‌కి కూడా అమెరికా వెళ్లేందుకు అనుమతి నిరాకరించారని, ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రతిదానికీ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు.
Punjab CM – పంజాబ్ నుంచి కనీస ప్రోత్సాహం కరవు: షూటర్ అర్జున్ బబుతా
ఇదిలా ఉండగా… క్రీడాకారులకు పంజాబ్ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం దక్కడం లేదంటూ షూటర్ అర్జున్ బబుతా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో అతికొద్ది తేడాతో కాంస్య పతకం చేజార్చుకున్న అర్జున్.. భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకేమీ ప్రయోజనాలు రాలేదు. 2022లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab CM), క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. చాలాసార్లు లెటర్లు కూడా రాసినా… అది ఇంకా నెరవేరలేదు. ఇది నిరుత్సాహానికి గురిచేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న షూటర్లను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించి ప్రత్యేకంగా కలుస్తున్నారు. పంజాబ్‌లో సీఎం, క్రీడల మంత్రిని కలిసే అవకాశం మాత్రం ఉండటం లేదు’’ అని ఆరోపించారు. ఈ క్రమంలోనే భగవంత్ మాన్ పారిస్ పర్యటనకు సిద్ధమవడం గమనార్హం.
Also Read : Shubhanshu Shukla: ఐఎస్ఎస్ యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఎంపిక !