MLC Kavitha : ఈసారైనా కవితకి బెయిల్ వచ్చేనా…
మహిళగా కవిత బెయిల్కి అర్హురాలు అంటూ కవిత తరపు న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదించారు...
MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠ నడుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22వ తేదీకల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యం అయిందని ప్రశ్నించింది.
MLC Kavitha Bail…
మహిళగా కవిత బెయిల్కి అర్హురాలు అంటూ కవిత(MLC Kavitha) తరపు న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదించారు. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు చేశారని, కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరపు న్యాయవాది వాదించారు. కేసు విచారణ పూర్తి చేసి, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారని కోర్టుకు కవిత(MLC Kavitha) తరపు న్యాయవాది తెలిపారు. రేపు ఇరుపక్షాల వాదనలను సుప్రీంకోర్టు విననుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వి. విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కవిత ఇప్పటి వరకూ ఎన్ని సార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినా వరుసగా నిరాశే ఎదురవుతోంది. కవిత తొలుత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరగా.. న్యాయమూర్తి నిరాకరించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఈడీ, సీబీఐ కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసినా.. నిరాశే ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ కవిత(MLC Kavitha)తోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ కవిత మరోసారి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇక ఫైనల్గా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఈ నెల 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే బెయిల్ ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న మరోసారి వాదనలు జరిగాయి. ఇక ఇవాళైనా కవితకు బెయిల్ వస్తుందో రాదో చూడాలి.
Also Read : Minister Savitha : బీసీ హాస్టల్ లో ఇంటర్ విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి