PM Modi : దేశంలో ‘ఫిన్‌టెక్‌’ కంపెనీ పనితీరుపై ప్రశంసలు కురిపించిన మోదీ

దేశంలో ఫిన్‌టెక్‌ కంపెనీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు.

PM Modi : దేశంలో ఫిన్‌టెక్‌ కంపెనీల పనితీరుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సంస్థల కారణంగానే ఆర్థిక సేవల ప్రజాస్వామీకరణ జరిగిందని ముంబైలో శుక్రవారం ముగిసిన గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ (జీఎ్‌ఫఎఫ్‌), 2024 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు. అయితే ఈ సంస్థలు అందించే ఆర్థిక సేవల్లో సైబర్‌ మోసాలు పెరిగి పోతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అడ్డుకోకపోతే ఫిన్‌టెక్‌ కంపెనీల మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. దేశంలో ఫిన్‌టెక్‌లు, స్టార్టప్‌ కంపెనీల అభివృద్ధికి సైబర్‌ మోసాలు అడ్డంకి కాకూడదని ప్రధాని మోదీ(PM Modi) స్పష్టం చేశారు. ఈ మోసాలకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెగ్యులేటరీ సంస్థలు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

PM Modi Appreciates

దేశంలో ఫిన్‌టెక్‌ కంపెనీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. ఇందుకోసం ఏంజిల్‌ ట్యాక్స్‌ రద్దు, పరిశోధన-నవకల్పనలకు రూ.లక్ష కోట్ల కేటాయింపుతో పాటు విధానపరమైన అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ చర్యలతో ఫిన్‌టెక్‌ రంగం గత పదేళ్లలో 3,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.6 లక్షల కోట్లు) పెట్టుబడులు ఆకర్షించగలిగిందన్నారు. ప్రపంచ ఫిన్‌టెక్‌ల విజయపరంపరలో మన యూపీఐ ఒక ఉదాహరణ అన్నారు. ఫిన్‌టెక్‌లతో అక్రమ నగదు లావాదేవీలకూ తెరపడుతుందని తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీ కారణంగా ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరిగిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. నేరుగా నగదు బదిలీ పథకం విజయమే ఇందుకు ఉదాహరణ అన్నారు.

గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ సందర్భంగా గూగుల్‌ పే పలు కొత్త డిజిటల్‌ చెల్లింపుల విధానాలను అవిష్కరించింది. ఇందులో యూపీఐ సర్కిల్‌ ఒకటి. ఈ ఫీచర్‌ ద్వారా గూగుల్‌ పే ఖాతాదారులు తమ కుటుంబ సభ్యులు, మిత్రుల బ్యాంకు ఖాతాలను లింక్‌ చేయకుండానే వారిని సెకండరీ యూజర్లుగా గూగుల్‌ పేలో చేర్చవచ్చు. ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో గూగుల్‌ పే ఈ ఫీచర్‌ తీసుకొచ్చింది. ఇంకా ‘ఈ-రూపీ, రూపే కార్డు హోల్డర్ల కోసం ట్యాప్‌ అండ్‌ పే విధానాలను ఆవిష్కరించింది.

Also Read : MLA Sabitha Indra Reddy : ఆరు గ్యారంటీ లను పక్కన పెట్టేందుకు ఆడుతున్న ఆటే ఈ ‘హైడ్రా’

Leave A Reply

Your Email Id will not be published!