Heavy Rains in AP: తెలంగాణ-ఏపీ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు !
తెలంగాణ-ఏపీ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు !
Heavy Rains: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల(Heavy Rains)తో తెలంగాణ-ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ -ఏపీ(AP) సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి వరదనీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Heavy Rains in AP..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై మోకాళ్ళ లోతులో వరద వస్తుండటంతో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో హైవే పూర్తిగా స్తంభించిపోయింది. వరద తగ్గేవరకు హైవేపై ఎవరినీ అనుమతించబోమని నందిగామ ఆర్డీవో రవీందర్రావు వెల్లడించారు.
వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సులోని 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. రహదారులపైకి నీరు చేరుకోవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విజయవాడ బస్టాండ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read : CM Nara Chandrababu Naidu: వరద ప్రభావిత ప్రాంతాలల్లో సీఎం చంద్రబాబు పర్యటన !