Minister Kishan Reddy : మూసీ సుందరీకరణకు సీఎం రేవంత్ సవాల్ కు సిద్ధమంటున్న కేంద్రమంత్రి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి కావస్తోందని....
Kishan Reddy : మూసీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న వారు మూడు నెలల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటే ప్రాజెక్టును విరమించుకుంటానంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. మూసీ ప్రాంతాల్లో పేదల ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నాను చేపట్టింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ… ‘‘సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల కోసం వారి ఇళ్లలో నివాసం ఉండేందుకు మేము సిద్ధం’’ అని స్పష్టం చేశారు.
Kishan Reddy Comment
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి కావస్తోందని.. నిరుపేదలకు ఇచ్చేందుకు ఏ ఇంటికి రేవంత్(Revanth Reddy) సర్కార్ శంకుస్థాపన చేయలేదని, భూమి పూజ చేయలేదని విమర్శించారు. కొత్తగా ఇవ్వకపోగా ఏండ్లుగా నివసిస్తున్న నిరుపేదల ఇండ్లను కూలుస్తోందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని.. ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను గారడీలుగా మార్చి మసి పూసి మారేడుకాయ చేశారన్నారు. ప్రజలను సోనియా, రాహుల్, రేవంత్ మభ్యపెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. ప్రజల ఇండ్లకు మార్కింగ్ వేసి ప్రజలను భయపెట్టారని తెలిపారు.
కేసీఆర్ దారిలోనే రేవంత్ వెళ్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ పేదల ఇండ్లను కూలిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ సుందరీకరణ చేసుకోవాలన్నారు. ‘‘ మూసీ బాధితులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్‌కు మూసీ పక్కన ఉండలేకపోతున్నామని చెప్పారా.. మా ఇండ్లు కూల్చమన్నారా. రేవంత్(Revanth Reddy)కు కలపడినట్టు ఉంది. అయితే ఆ కల లక్షన్నర కోట్లపైన అయి ఉండొచ్చు.. కానీ పేద ప్రజలకు మంచి చేయాలనేది మాత్రం కాదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మూసీ బాధితులకు అండగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు. వారికోసం అవసరమైతే చంచల్ గూడ జైలుకు అయినా, చర్లపల్లి జైలుకు అయినా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘ రేవంత్ పోలీసులతో వస్తాడా? ఎలా వస్తాడో కానీ బస్తీల్లోకి రావాలి. ఆయన్ను ప్రజలు ఏమనకుండా మేము రక్షణగా ఉంటాం.. సెక్యూరిటీ విషయంలో ఆయనకు చింత అక్కర్లేదు. డ్రైనేజీ సిస్టం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యం. రేవంత్‌కు పేదలకు కనీస సౌకర్యాలు అందించడం ముఖ్యమా.. మూసీ సుందరీకరణ అవసరమో తేల్చుకోవాలి. వాస్తవానికి మాకు రెండూ ముఖ్యమే.. కానీ ముందు పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించి తర్వాత సుందరీకరణ చేసేవాళ్ళం. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ, దశ లేదు. ఎలా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో కూడా తెలియడం లేదు. ఒక బస్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయారని తెలిసింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆవేదన చెందకండి.. మీకు అండగా బీజేపీ ఉంటుంది’’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read : TG CP Anand : డ్రగ్స్ దందాపై సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్