Jharkhand CM : జార్ఖండ్ గవర్నర్ తో భేటీ అయిన జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్
ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. రెండు విడతలుగా జరిగాయి...
Jharkhand CM : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో సీఎం హేమంత్ సోరన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు మరో సారి పట్టం కట్టారు. దీంతో రాష్ట్రంలో వరుసగా మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ క్రమంలో ఆదివారం జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీలో రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో సీఎం హేమంత్ సోరెన్ సమావేశం కానున్నారు. ఈ ఎన్నికల్లో తమకు ప్రజలు మరోసారి అధికారం అందుకునేలా తీర్పు ఇచ్చారని ఆయనకు వివరించనున్నారు.
Jharkhand CM Meet..
ఈనేపథ్యంలో తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్ర గవర్నర్‌ను సీఎం హేమంత్ సోరెన్ కోరనున్నారు. గవర్నర్ ఆహ్వానించిన వెంటనే.. నవంబర్ 26వ తేదీ అంటే.. మంగళవారం సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జార్ఖండ్(Jharkhand) అసెంబ్లీకి మొత్తం 81 స్థానాలున్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. రెండు విడతలుగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, జార్ఖండ్(Jharkhand) ముక్తి మోర్చ తదితర పార్టీలు మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీంతో జార్ఖండ్ ప్రజలు మరోసారి ఇండియా కూటమికి పట్టం కట్టినట్లు అయింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. అలాగే ప్రస్తుత అధికార జార్ఖండ్ ముక్తి మోర్చపై విమర్శలు గుప్పించారు. కానీ ఆయా విమర్శలను ఆ రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం పట్టించు కోలేదు. దీంతో జేఎంఎంకు ప్రజలు మరోసారి పట్టం కట్టారు.
ఈఏడాది మొదటల్లో భూ కుంభకోణం వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని బిర్సా ముండా జైలుకు తరలించారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి హేమంత్ రాజీనామా చేశారు. దీంతో ఆయన సమీప బంధువు చంపయి సోరెన్.. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు.. హేమంత్ సోరెన్ బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ సీఎంగా హేమంత్ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్దం కావడంతో.. చంపయి సోరెన్.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కొద్ది రోజులకే చంపయి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో హేమంత్
సోరెన్ కుటుంబ సభ్యులు సైతం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిందంటే.. అందుకు తమ హయాంలోని గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే కీలక భూమిక పోషించాయని జేఎంఎం అగ్రనేతలు ఈ సందర్భంగా వెల్లడిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ మళ్లీ గెలిచిందంటే.. అందుకు హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తోపాటు ఆయన కుటుంబానికి ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలు సైతం ఓ కారణమనే ఓ చర్చ సైతం సాగుతుంది.
Also Read : Adani-YS Jagan Case : ధర్మాసనం వరకు చేరిన అదానీ, జగన్ ల అమెరికా కేసు