YS Jagan-SC : మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు వాయిదా వేసిన ధర్మాసనం

దీంతో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వచ్చే సోమవారం (జనవరి 27)కు వాయిదా వేసింది...

YS Jagan : అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) బెయిల్ రద్దు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. జగన్(YS Jagan) బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ దాఖలు చేసిన పిటీషన్‌పై ఈరోజు (సోమవారం) విచారణకు వచ్చింది. అయితే సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున విచారణ వాయిదాకు సీబీఐ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం(Supreme Court) వచ్చే సోమవారం (జనవరి 27)కు వాయిదా వేసింది.

YS Jagan Case – Supreme Court

కాగా..జగన్ బెయిల్ రద్దు, కేసుల బదిలీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌‌పై సుప్రీంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులను విచారిస్తున్న ధర్మాసనంలో మార్పు జరిగింది. గతంలో విచారించిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం నుంచి జస్టిస్ వీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మసనానికి సుప్రీం కోర్టు రిజిస్ట్రీ మార్చింది. గత పన్నెండు సంవత్సరాలుగా ట్రయల్ ఒక్క అడుగుకూడా ముందుకు కదలలేదంటూ జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు రఘురామ తరపు న్యాయవాది శ్రీనివాసన్ వాదించారు.

గత పదేళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోస్ చేయలేదని, ఈ వ్యవహారంలో సీబీఐ, నిందితులు ఇద్దరూ కూడా కుమ్మక్కై ఒక్క అడుగు కూడా కదలనీయడం లేదంటూ రఘురామ తరుపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరోపక్క డిశ్చార్జ్ పిటిషన్‌లపై వాదనలు విని వాటిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని.. ప్రతీ సారి ఇలా జరుగుతున్నందున ఇందులో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానం కలుగుతోందని, ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్‌పై తుది నిర్ణయం వెలువడకుండా బదిలీ అవడంతో కుట్రకోణం దాగి ఉందని అనడంలో సందేహం లేదని రఘురామ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఆ ఉద్దేశంతోనే ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నట్లు పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే బదిలీ సాధ్యం కాదని గత విచారణలో సుప్రీం కోర్టు తేల్చిచెప్పినందున కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుకుంటున్నట్లు న్యాయవాది శ్రీనివాసన్ చెప్పారు. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని కూడా సీబీఐ తరపున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు.

గతపదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని.. సుప్రీం కోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ట్రయల్‌లో జాప్యం జరుగుతూనే ఉందని.. కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున ఈ కేసుకు సంబంధించి వచ్చే వారానికి వాయిదా వేయాలని సీబీఐ తరపు న్యాయవాది కోరడంతో కేసు విచారణను వచ్చే సోమవారం చేపడతామని జస్టిస్ వీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తేల్చింది. వచ్చే సోమవారం ఈ పిటిషన్‌పై తుది విచారణ జరిగే అవకాశం ఉంది.

Also Read : Donald Trump Oath Ceremony : అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రపంచ ప్రముఖులు

Leave A Reply

Your Email Id will not be published!