MLA Danam Nagender : చింతల్‌బస్తీ ఆక్రమణల తొలగింపుపై భగ్గుమన్న ఎమ్మెల్యే

Danam Nagender : చింతల్‌బస్తీలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపుపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Danam Nagender) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి సముదాయాలను కూల్చివేయడంపై ఆయన మండిపడ్డారు. సీఎం వచ్చాక చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

MLA Danam Nagender Comments

దీంతో ఆగ్రహించిన ఆయన బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి తమవారిపై దౌర్జన్యం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని, తన పదవి పోయినా పర్వాలేదు కానీ కూల్చివేతలను అడ్డుకుని తీరతానని హెచ్చరించారు. కొందరు అధికారులు చేస్తున్న ఇలాంటి పనులతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, నగరంలో అనేక అక్రమ నిర్మాణాలున్నా వాటి జోలికి వెళ్లని అధికారులు చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు.

అయితే కూల్చివేతలు ఆపేందుకు పోలీసులు ససేమిరా అనడంతో, తాను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతానంటూ ఎమ్మెల్యే దానం(Danam Nagender) వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్‌ హుస్సేన్‌ వచ్చి పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. అయితే పేదల డబ్బాలను నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేస్తున్నారని, లొలగించుకునేదుకు వారికి అవకాశం ఇవ్వాలని కోరగా పోలీసులు కొంత సమయం ఇచ్చారు. ఆ సమయంలో కొందరు తమ డబ్బాలను తొలగించుకోగా.. సమయం ముగిసిన అనంతరం మిగిలిన వాటిని పోలీసులు కూల్చివేయించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆక్రమణలను తొలగించేందుకు ఉన్నత స్థాయి అధికారుల బృందం పక్కా స్కెచ్‌తో వ్యవహరించింది. జీహెచ్‌ఎంసీ, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ విభాగాలకు చెందిన అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఆక్రమణలను నేలమట్టం చేశారు.ఖైరతాబాద్‌ షాదన్‌ కళాశాల ఎదురుగా ఉన్న చింతల్‌బస్తీ ప్రధాన రహదారి నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 రహదారి వరకు దాదాపు కిలో మీటర్‌ మేర ఆగ్రమణలను తొలగించారు. ఆక్రమణలను తొలగిస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read : MLC Kavitha : కాంగ్రెస్ పార్టీ నాయకులు మా జోలికి వస్తే ఊరుకునేది లేదు

Leave A Reply

Your Email Id will not be published!