తిరుమల : టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎం.రవిచంద్రతో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టీటీడీ చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను రూ.118.89 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా డిజిటల్ క్లాస్ రూములు, అదనపు హాస్టల్ బ్లాకులు, వంట గదుల ఆధునీకరణ, ఇతర మౌళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.
భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు బీఆర్ నాయుడు. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో కానుకలు వేస్తున్నారని తెలిపారు. ఇందుకు బదులుగా భక్తులు తిరుమలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో UPI ద్వారా చెల్లింపులు చేస్తే అందుకు తగిన ముడుపు పత్రాలు అందజేస్తారని చెప్పారు. వాటిని నేరుగా శ్రీవారి హుండీలో వేయవచ్చని తెలిపారు. తద్వారా భక్తులు నగదు, నాణేలు తీసుకు వచ్చేందుకు ఉన్న ఇబ్బందులు తొలగి పోతాయన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో అన్న ప్రసాద భవనం, ఆధునిక వంటశాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్లు విరాళం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. దీంతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం తెలిపామన్నారు.
