తిరుపతి :కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాద్యాలు, భజన బృందాల కీర్తనల మధ్య స్వామివారు దివ్య రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు మంగళ దర్శనం ప్రసాదించారు.
ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన రథోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగగా, అడుగడుగునా కర్పూర హారతులతో స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనలతో గ్రామమంతా ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం వేద పారాయణం, ప్రబంధ పఠనం, శాత్తుమొర, హారతి కార్యక్రమాలు నిర్వహించారు.
వేదాంత దృష్టిలో ఆత్మనే రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు వీధులుగా భావిస్తారు. ఈ రథోత్సవం ద్వారా శరీరానికి అతీతమైన ఆత్మ స్వరూపాన్ని గ్రహించి ఆత్మానాత్మ వివేకాన్ని పెంపొందించు కోవాలనే గొప్ప తాత్త్విక సందేశాన్ని స్వామి వారు భక్తులకు అందిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామివారి అశ్వవాహన సేవ భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెంగల్రాయులు, ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల చివరి రోజైన జూన్ 14 ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ధ్వజావరోహణం జరగడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
