తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తీపి కబురు చెప్పింది. సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, సేవలు, వసతి గదుల ఆన్లైన్ కోటా వివరాలను ప్రకటించింది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన , అష్టదళ పాద పద్మారాధన సేవ వంటి అర్జిత సేవల కోటా జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు ‘ఎలక్ట్రానిక్ డిప్’ (Electronic Dip) కోసం జూన్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించింది టీటీడీ. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపికైన వారు జూన్ 20 నుండి జూన్ 22 (మధ్యాహ్నం 12 గంటల వరకు) మధ్య చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది. చెల్లింపు విజయవంతమైన తర్వాత టిక్కెట్లు ఖరారు చేయనున్నట్లు పేర్కొంది.
ఇక భక్తులకు సంబంధించి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవ, సహస్ర దీపాలంకరణ సేవ టిక్కెట్లు జూన్ 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వర్చువల్ సేవలు , వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటా జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జూన్ 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు జూన్ 23న ఉదయం 11 గంటలకు, అలాగే వృద్ధులు , దివ్యాంగుల కోటా జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టిక్కెట్ల కోటా జూన్ 24న ఉదయం 10 గంటలకు, అలాగే తిరుమల , తిరుపతిలో వసతి గదుల కోటా జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపింది. భక్తులు అర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు , వసతిని కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ (ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరింది.
