Minister Kishan Reddy : సీఎం రేవంత్ మాటలతో పబ్బం..అభివృద్ధి శూన్యం

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి రాబోతోందని కిషన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు...

Kishan Reddy : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ కులమేంటీ..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు ఒకేతాను ముక్కలని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) వరంగల్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. గుడ్డెద్దు చేనులో పడినట్లుగా కాంగ్రెస్ పాలన ఉందని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతోనే పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు. కులగణనకు బీజేపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.42శాతం రిజర్వేషన్లపై మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కులసంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు.అప్పుడు తమ నిర్ణయం చెబుతామని కిషన్‌రెడ్డి అన్నారు.

Minister Kishan Reddy Slams

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) క్లారిటీ ఇచ్చారు. బయ్యారం ఐరన్ ఓర్‌లో క్వాలిటీ లేదని చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరిపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. రేవంత్ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి లేని విషయాలను కల్పించుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల దగ్గర హాజరువేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఇష్టం వచ్చినట్లుగా రేవంత్‌రెడ్డి మాట్లాడితే.. చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్ దృష్టి మరల్చినంత మాత్రాన ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు మరచిపోరని కిషన్‌రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి రాబోతోందని కిషన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇలాగే వ్యతిరేకత వచ్చిందని.. అందుకే కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పదేళ్లు పట్టింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత మూటగట్టుకుందని చెప్పుకొచ్చారు. నాడు ప్రతిపక్షమే ఉండకూడదని కేసీఆర్ భావించారని అన్నారు. ఏకంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ మూలాన్నే దెబ్బతీశారని కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : MLA KTR : ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా అస్తవ్యస్తమయింది

Leave A Reply

Your Email Id will not be published!