Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయానికి త్వరలో స్వయంప్రతిపత్తి
యాదగిరిగుట్ట ఆలయానికి త్వరలో స్వయంప్రతిపత్తి
Yadagirigutta Temple : తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనితో యాదగిరిగుట్ట ఆలయంపై దేవాదాయశాఖ కమిషనర్ నియంత్రణ ఇక ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దేవాలయం ఉండనుంది. యాదగిరిగుట్ట ఆలయానికి(Yadagirigutta Temple) ట్రస్ట్‌బోర్డు, పదవీకాలం, నిధులు, ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్‌రూల్స్, ఈఓగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను క్యాబినెట్ కు నోట్ రూపంలో అందించారు. దేవాదాయశాఖ చట్టం-1987లోని చాప్టర్ 14 కింద యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని చేర్చినట్లు తెలిసింది.
Yadagirigutta Temple…
ఈ మేరకు అసెంబ్లీలో చట్టసవరణ చేయనున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈఓగా ఐఏఎస్ అధికారిని లేదంటే అదనపు కమిషనర్, ఆపై స్థాయి అధికారిని నియమించాలని క్యాబినెట్ కు సమర్పించిన నోట్‌లో పేర్కొన్నారు. ఈ బోర్డుకు ఛైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమిస్తారు. ఇందులో ఒకరు ఫౌండర్ ట్రస్టీగా కాగా మిగిలిన 9 మందిని రాష్ట్రప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఉంటారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ వీసీ, ఆలయ స్థానాచార్యులు జాబితాలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులూ ఉంటారు. బోర్డు పదవీకాలం మూడేళ్లు ఉండాలని నోట్ లో ప్రతిపాదించారు. వార్షికాదాయం రూ.100 కోట్లు దాటే ఏ ఆలయాన్నయినా ఇదే తరహాలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. వేములవాడ దేవస్థానానికి సైతం ఇలాంటి ట్రస్ట్‌బోర్డు వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాల సమాచారం.
Also Read : SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్ లోకి క్యాడవర్ డాగ్స్ బృందం