Rajnath Singh: డీలిమిటేషన్ తో సీట్ల సంఖ్య మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి రాజ్‌నాథ్
డీలిమిటేషన్ తో సీట్ల సంఖ్య మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి రాజ్‌నాథ్
Rajnath Singh : నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గుతుందని జరుగుతున్న చర్చపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) స్పందించారు. డీలిమిటేషన్(Delimitation) తో తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆయన అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా కొనసాగుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఎంకే స్టాలిన్‌కు దీనిపై ఏదైనా అభ్యంతరం ఉంటే వాటిని లేవనెత్తే స్వేచ్ఛ ఆయనకు ఉంటుందని అన్నారు.
Rajnath Singh Comment about Delimitation
ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ… డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా కొనసాగుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు ఏదైనా అభ్యంతరం ఉంటే వాటిని లేవనెత్తే స్వేచ్ఛ ఆయనకు ఉంటుందని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్చలు జరుపుతారని, నిర్ణయం న్యాయంగానే ఉంటుందని చెప్పారు.
శాసనసభ అయినా, లోక్‌సభ అయినా ప్రతి రాష్ట్రంలోనూ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య సహజంగానే పెరుగుతుందని అన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో కూడా సీట్లు పెరుగుతాయని, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే ప్రయోజనం పొందుతాయనడం సరైన వాదన కాదని రాజ్‌నాథ్ చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించాలంటూ ఏడుగురు ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
డీలిమిటేషన్‌పై దద్దరిల్లిన పార్లమెంట్
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతోందంటూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. జీరో అవర్ తర్వాత దీనిపైనే చర్చ చేపట్టాలని డిమాండు చేస్తూ వెల్ లోని వెళ్లి నినాదాలు చేశారు. దీనితో సభ 40 నిమిషాలపాటు వాయిదా పడింది. జీరో అవర్ లో ఈ అంశాన్ని డీఎంకే ఎంపీ గిరిరాజన్ ప్రస్తావించారు. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన కేరళ, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాలు డీలిమిటేషన్‌వల్ల నష్టపోతాయని, సరిగా అమలు చేయని ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ వంటివి లాభపడతాయని పేర్కొన్నారు. మరోవైపు సభలో డూప్లికేట్ ఓటరు ఐడీ కార్డుల జారీలో ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ చర్యలకు కాంగ్రెస్, తృణమూల్, బిజూ జనతాదళ్, శివసేన (ఉద్ధవ్) సభ్యులు పట్టుబట్టారు.
లోక్‌సభలో విచక్షణ కోల్పోయిన బీజేపీ ఎంపీ
లోక్‌సభలో మంగళవారం అండమాన్, నికోబార్‌కు చెందిన బీజేపీ ఎంపీ బిష్ణు పాద రే విచక్షణ కోల్పోయారు. దీనితో ఆయనను మంత్రి కిరణ్ రిజిజు సముదాయించి కూర్చోబెట్టాల్సి వచ్చింది. ట్రెజరీ బెంచ్ లో కూర్చున్న ఆయన… ఒక్కసారిగా అరవడం ప్రారంభించారు. దీనితో సభ్యుల దృష్టంతా అటువైపు మళ్లింది. దీనితో వెంటనే రిజిజు వెళ్లి ఆయనను సముదాయించారు. తాను ప్రస్తావించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన రెచ్చిపోయారు.
Also Read : Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ చేస్తాం – శశికళ