Minister Nara Lokesh: టీడీపీ కార్యకర్త దారుణ హత్య ! తీవ్రంగా ఖండించిన మంత్రి లోకేష్ !
టీడీపీ కార్యకర్త దారుణ హత్య ! తీవ్రంగా ఖండించిన మంత్రి లోకేష్ !
Nara Lokesh : చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. తనకు ప్రాణహానీ ఉందంటూ వీడియో రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ(TDP) కార్యకర్త రామకృష్ణను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. పాత కక్షలతో మాజీ వాలంటీర్, వైసీపీ కార్యకర్త వెంకటరమణ కొడవలితో రామకృష్ణని నరికాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు కన్నుమూశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Nara Lokesh Responds TDP Activist Murder
హత్యకు గురైన రామకృష్ణ… నాలుగైదు రోజుల క్రితం ఓ వీడియోను రిలీజ్ చేశారు. వైసీపీ వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అందులో తెలిపారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు టీడీపీ కార్యకర్త. వీడియో రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే ఈరోజు రామకృష్ణ దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది.
పెద్దిరెడ్డి ఆగడాలను సహించం – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా
పుంగనూరులో జరిగిన టీడీపీ నేత రామకృష్ణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ అమానవీయ ఘటన పుంగనూరులో వైసీపీ అరాచకాలకు నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి ఇంటికి పంపినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. భయభ్రాంతులతో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పెద్దిరెడ్డి ఆగడాలను సహించమన్నారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇలాంటి హత్య రాజకీయాలను కూకటివేళ్లతో పెకిలించివేస్తుందని తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ సంతాపం
టీడీపీ కార్యకర్త దారుణ హత్యను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా మృతుని కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసారు. ఈ మేరకు నారా లోకేష్ ఎక్స్ లో
“వైసీపీ రాక్షస మూకల దాడిలో గాయపడి మృతి చెందిన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ కొడుకు సురేష్ కి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాను. శవం దగ్గర పుట్టి, మరో మృతదేహంతో అధికారంలోకొచ్చిన జగన్ మోహన్ రెడ్డిని జనం ఛీకొట్టారు. అయినా హత్యారాజకీయాలు మానడంలేదు. నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తాం. వైసీపీ రక్తచరిత్రకు టిడిపి సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం” అంటూ పోస్ట్ చేసారు.
Also Read : Guntur Mayor: గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా