Amit Shah: అస్సాంలో మోదీ వల్ల శాంతి, కాంగ్రెస్ వల్ల అశాంతి – అమిత్‌షా
అస్సాంలో మోదీ వల్ల శాంతి, కాంగ్రెస్ వల్ల అశాంతి - అమిత్‌షా
Amit Shah : కాంగ్రెస్ అధికారంలో ఉండగా అస్సాంలో శాంతి స్థాపనకు వీలు కల్పించలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. అప్పట్లో రాష్ట్రానికి ఎటువంటి గ్రాంట్లు అందకపోవడంతో ఆందోళనలు, హింసాత్మక కార్యక్రమాలకు, వెనుకబాటుకు మారుపేరుగా అస్సాం మారిందని విమర్శించారు. విద్యార్థిగా ఉండగా అస్సాంకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేసుకుంటూ… ‘అప్పట్లో కాంగ్రెస్(Congress) నేత హితేశ్వర్ సైకియా సీఎంగా ఉండేవారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అరెస్టయిన వారిలో నేనూ ఉన్నా. వారం పాటు నన్ను జైల్లో పెట్టారని, కఠినంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
Amit Shah Slams
అప్పటి కాంగ్రెస్ హయాంతో, ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అస్సాంలో గుర్తు పట్టలేనన్ని మార్పులు సంభవించాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడమేకాక, మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచారని, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించారని ఆయన అన్నారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలోని దెర్‌గావ్‌లో శనివారం లచిత్ బార్ఫూకాన్ పోలీస్ అకాడమీ తొలిదశ భవన సముదాయాన్ని ప్రారంభించి రెండో దశ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ… ‘‘రాష్ట్రంలో శాంతి తిరిగి రావడంతో పదేళ్లలో 10 వేల మందికి పైగా యువకులు ఆయుధాలు త్యజించి జనజీవన స్రవంతిలో కలిశారు. ఒకప్పుడు ఉద్యమాలకు, హింసకు, తిరుగుబాటుకు నెలవైన అస్సాం ఈరోజు అత్యాధునిక సెమీ కండక్టర్ పరిశ్రమకు కేంద్రం. ఇక్కడ ఈ పరిశ్రమ కోసం రూ. 27,000 కోట్లు వెచ్చించబోతున్నాం. ఇది అస్సాం భవితవ్యాన్ని మార్చేయనుంది’’ అని అమిత్ షా వివరించారు. పెట్టుబడుల సదస్సులోని ప్రాజెక్టులు కార్యరూపు దాలిస్తే దేశం నలుమూలల నుంచి యువకులు అస్సాంకు వస్తారని చెప్పారు. ఇటీవల ముగిసిన అడ్వాంటేజ్ అస్సాం 2.0లో మరో రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయి. ఇవి ఏర్పాటైతే యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని మంత్రి చెప్పారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు.
అనంతరం అమిత్ షా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మిజోరంలో అభివృద్ధి పనుల పురోగతిపై స్వయంగా ప్రధాని మోదీయే సమీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌ను ఐజ్వాల్ వెలుపలికి మార్చడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. మిజో ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రం పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన తెలిపారు. 2014కు పూర్వం ప్రధానమంత్రులంతా కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది 21 సార్లు మాత్రమే రాగా, ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో 78 పర్యాయాలు పర్యటించారని అమిత్ షా చెప్పారు.
Also Read : YS Sunita Reddy: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీతా