Speaker Ayyanna Patrudu: దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు – స్పీకర్ అయ్యన్న
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు - స్పీకర్ అయ్యన్న
Ayyanna Patrudu : ఏపీ అసెంబ్లీలో సభ్యుల హజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు చేశారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయిన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని సూచించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ సభ్యులు దొంగల్లా సభకు వస్తున్నారని, సంతకాలు పెట్టి వెళుతున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రిజిష్టర్ లో సంతకాలు చేసిన వారు సభలో తనకు కనిపించలేదని అయ్యన్న పాత్రుడు అన్నారు.
Speaker Ayyanna Patrudu Comment
ప్రజా ప్రతినిధులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని, మొఖం చాటేయడం ఎందుకని స్పీకర్ అయ్యన్న(Ayyanna Patrudu) ప్రశ్నించారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడం ఏంటన్నారు. హజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదన్నారు. వై బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధ రెడ్డి, విశ్వేశరరాజులు తదితరులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం తరువాత వేర్వేరు రోజుల్లో వారు సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోందన్నారు. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నామని అయ్యన్న పాత్రుడు అన్నారు.
దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం వైఎస్సార్సీపీ సభ్యులకు లేదని, వారు గౌరవంగా సభకు వచ్చి మాట్లాడవచ్చు కదా అని స్పీకర్ అయ్యన్న అన్నారు. ప్రశ్నలు అడిగి కొంతమంది సభ్యులు సభలో లేకుండా వెళ్లిపోతున్నారని, దీని వలన అసలు ప్రశ్నలు అడగాల్సిన సభ్యులు అవకాశం కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఇటువంటి సంప్రదాయం మంచిది కాదన్నారు. ఈ సమావేశంలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాలేదని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు వేయడం వల్ల మరో ఇద్దరు మెంబర్లు అడగడానికి ఇబ్బంది వస్తోందన్నారు. ఇది సమంజసం కాదని.. ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండడం లేదని… ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.
Also Read : Fake Baba: దొంగ బాబా గుట్టు రట్టు చేసిన మెదక్ పోలీసులు