Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీట్రాప్ ! బీజేపీపై సీఎం సిద్ధు విసుర్లు !
కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీట్రాప్ ! బీజేపీపై సీఎం సిద్ధు విసుర్లు !
Karnataka Assembly : కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోన్న హనీ ట్రాప్ వ్యవహారం… శుక్రవారం జరిగిన అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై శాసనసభలో చర్చించాల్సిందేనని బీజేపీ(BJP) పట్టుబట్టింది. అయితే ఆ నిరసనలను పట్టించుకోకుండా ముస్లిం కోటా బిల్లును స్పీకర్ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో సభ ఒక్కసారిగా అలజడి రేగింది. ఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు ప్రతులను చించి స్పీకర్ ముఖంపైకి విసిరి కొట్టారు. ప్రతిగా.. కాంగ్రెస్ సభ్యులు బుక్‌లు, పేపర్లను ప్రతిపక్ష సభ్యులపైకి విసిరారు. ఈ గందరగోళం నడుమ సభను స్పీకర్ కాసేపు వాయిదా వేశారు.
Karnataka Assembly – హనీట్రాప్ లో ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదు – సీఎం సిద్దు
హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామన్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)… ఇందులో నుంచి ఎవరినీ రక్షించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. చట్టప్రకారం దోషులకు తప్పక శిక్ష పడుతుందన్నారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే… కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్ బాధితులుగా ఉన్నారంటూ కర్ణాటక మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాశంమైన సంగతి తెలిసిందే. ఇందులో అధికార, విపక్ష సభ్యులతో పాటు జాతీయ స్థాయిలోని నాయకులు కూడా ఉన్నారంటూ ఆయన బాంబ్ పేల్చారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నారన్నారు. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ… బీజేపీ మాత్రం ఈ వలపు వల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తమే ఉందని, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తోంది.
Also Read : Marri Rajasekhar: జగన్ వైఖరి, మోసం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసాను – మర్రి రాజశేఖర్