Minister Thummala Nageswararao : పామ్ ఆయిల్ రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల
పామ్ ఆయిల్ రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల
Thummala Nageswararao : తెలంగాణాలో పామ్ ఆయిల్ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో శుభవార్త చెప్పారు. ఖమ్మం జిల్లాలో తొలి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ స్థాపనకు అడుగులు పడ్డాయని ఆయన తెలిపారు. వేంసూర్ మండలం కల్లూరు గూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ఆదివారం మంత్రి తుమ్మల(Thummala Nageswararao) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి పాల్గొన్నారు. ఆయిల్ పామ్ రైతులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. మంచి పనులు మొదలు పెట్టినపుడు ఆటంకాలు ఉంటాయని చెప్పారు. దశాబ్దాల వేంసూరు సాగు నీటి కలను సాకారం చేసేలా ఎన్టీఆర్ కాలువ పూర్తి చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Minister Thummala Nageswararao Comment
సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజీవ్ కెనాల్ ప్రతిపాదన చేయగానే సీఎం రేవంత్‌రెడ్డిని అడగ్గానే ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswararao) చెప్పారు. కొందరు అడ్డుపడ్డా సీఎం రేవంత్ పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆశీస్సులతో తన జీవితం ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి, ప్రజా సేవ కోసమేనని ఉద్ఘాటించారు. గత కేసీఆర్ ప్రభుత్వం అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. రైతు రుణమాఫీ రైతు భరోసాతో సీఎం రేవంత్ చరిత్రలో నిలిచారని అన్నారు. తెలంగాణ పచ్చగా మారాలంటే ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
తెలంగాణ రైతాంగం తలరాత ఆయిల్ పామ్ సాగుతో మారబోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాబోయే పదేళ్లలో ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుతో గ్రీన్ తెలంగాణగా మారనుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు చీడ పీడలు లేకుండా తక్కువ ఖర్చుతో దీర్ఘ కాలిక లాభాలు తెచ్చే పంట ఆయిల్ పామ్ అని వివరించారు. ఆయిల్ పామ్ సాగులో సత్తుపల్లి తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రైవేట్ కంపెనీలను నమ్మి రైతులు నట్టేట మునగొద్దని సూచించారు. ఆయిల్ ఫెడ్ ఉంటేనే పామాయిల్ సాగు రైతులకు భరోసా ఉంటుందని చెప్పారు.
త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఆయిల్ పామ్ సాగుకు మినిమం గ్యారంటీ ప్రైస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని అన్నారు. ఆయిల్ పామ్ సాగు రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. సత్తుపల్లి నియోజక వర్గంలో గోదావరి జలాలతో పాటు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో ప్రగతి బాటలు పయనిస్తోందని అన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ – మంత్రి సీతక్క