Minister Ravneet Singh Bittu: నా హత్యకు ఖలిస్థానీయుల కుట్ర – కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
నా హత్యకు ఖలిస్థానీయుల కుట్ర - కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
Ravneet Singh Bittu : కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు(Ravneet Singh Bittu) సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్పాల్ సింగ్ నడిపిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తనతో పాటు పంజాబ్ లో మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీయుల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. సోషల్ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్ పాల్ నిర్బంధం మరో ఏడాది పొడిగించడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా వారిస్ పంజాబ్ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. ఇలాంటి కుట్రల వల్ల అస్థిరత పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని బిట్టు హెచ్చరించారు.
Union Minister Ravneet Singh Bittu Sensational Comments
అమృత్ పాల్ నిర్బంధాన్ని మరో ఏడాదిపాటు పెంచుతూ ఇటీవల పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసులపై దాడి కేసులో 2023 ఏప్రిల్లో అరెస్టయిన అమృత్పాల్ ప్రస్తుతం అస్సాంలోని జైలులో ఉన్నాడు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేశాడు. పంజాబ్ లోని ఖదూర్ సాహెబ్ స్థానం నుంచి దాదాపు లక్షన్నర ఓట్ల తేడాతో గెలుపొంది లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యాడు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్ధూ మరణంతో అమృత్పాల్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటినుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్ నే స్థావరంగా ఎంచుకున్నాడు. అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్పాల్ పేరు దేశంలో మార్మోగింది. ఆ ఘటన తర్వాత దాదాపు నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న అతడిని… చివరకు అరెస్టు చేసి అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
Also Read : US Vice President JD Vance: భారత్ కు చేరుకున్న జేడీ వాన్స్ ! అక్షర్ ధామ్ ఆలయంలో జేడీ వాన్స్ దంపతులు !