Operation Karregutta: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కగార్ ! ముగ్గురు మావోయిస్టులు మృతి ?
చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కగార్ ! ముగ్గురు మావోయిస్టులు మృతి ?
Operation Karregutta : చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్ మూడో రోజు కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాళ్లగూడెం వద్ద అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా… ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడగా… బీజాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ లో వరుస ఎన్ కౌంటర్ల తరువాత… పెద్ద ఎత్తున మావోయిస్టులు చత్తీస్‌గఢ్(Chhattisgarh)-తెలంగాణ(Telangana) సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టిట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా మూడు హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో డ్రోన్‌ల ద్వారా ములుగు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
మరోవైపు.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు వేల మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Operation Karregutta – మాకేం సంబంధం లేదు – తెలంగాణా పోలీసు
కర్రిగుట్టలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్(Operation Karregutta)… కూంబింగ్‌కు తమకు సంబంధం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఛత్తీస్‌గఢ్- కేంద్ర బలగాలు చూసుకుంటున్నాయని, తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రకటించారు. కూబింగ్‌లో పాల్గొంటున్న కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో… కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో… ఇటు తెలంగాణాలోని ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని… గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్ స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు… మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
వరంగల్‌లో 14 మంది మావోయిస్టుల లొంగుబాటు
వరంగల్ లో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిని ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఒక్కో మావోయిస్టుకు రూ.25వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ… ‘‘రెండు నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాం. ఈ ఏడాది 250 మంది సరెండర్ అయ్యారు. నేడు 14 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25వేలు అందజేశాం. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే మా ఉద్దేశం. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా సహకారం అందిస్తాం. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
Also Read : Betting Apps: మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై హైకోర్టులో నమోదైన పిల్