India: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్ళే..

ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల పేర్లు విడుదల

India : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లో భారత్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. దీనితో భారత్‌ పై పాక్ ప్రతిదాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే ఇండియన్‌ ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. తొలుత తాము పాల్గొనలేదని పాక్‌ బుకాయించినా భారత్‌ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ అధికారుల పేర్లను భారత్‌(India) విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

India – ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ అధికారులు వీరే

లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్‌ కమాండర్‌
మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్‌, లాహోర్ 11వ ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్
బ్రిగేడియర్‌ మహ్మద్‌ ఫర్ఖాన్ షబ్బీర్
డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్‌ పంజాబ్ పోలీస్
మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్‌ అసెంబ్లీ మెంబర్

పాక్‌ కు కీలక సమాచారం చేరవేస్తున్న ఇద్దరి అరెస్టు

ఢిల్లీలోని పాకిస్థాన్‌(Pakistan) హై కమిషన్‌ కార్యాలయ అధికారికి దేశ కీలక సమాచారం అందించారనే ఆరోపణలతో పంజాబ్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. మన సైన్యానికి చెందిన సున్నిత సమాచారాన్ని పాక్‌ అధికారికి వీరు చేరవేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో పంజాబ్‌ లోని మలేర్‌ కోట్లకు చెందిన గుజాలా, యమీన్‌ మహ్మద్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రహస్య సమాచారం చేరవేసినందుకు ప్రతిఫలంగా ఆన్‌లైన్‌ ద్వారా కొంత మొత్తాన్ని నిందితులు స్వీకరించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

Also Read : ICAR Scientist Subbanna Ayyappan: వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యప్పన్‌ అనుమానాస్పద మృతి

Leave A Reply

Your Email Id will not be published!