Spurious Liquor: పంజాబ్‌లో విషాదం ! కల్తీ మద్యం తాగి 21 మంది మృతి !

పంజాబ్‌లో విషాదం ! కల్తీ మద్యం తాగి 21 మంది మృతి !

 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. మజీఠా పట్టణ పరిధిలో కల్తీ మద్యం త్రాగి 21 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం వీళ్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని సోమవారం రాత్రి ఐదు గ్రామాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. అమృత్‌సర్‌ జిల్లా భంగాలీ, పతాల్‌పురీ, మరారి కలన్, తల్వాండి ఖుమ్మన్, కర్నాలా, భంగ్వాన్, థెరెవల్‌ గ్రామాల్లో సోమవారం ఈ ఘటనలు వెలుగుచూశాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం సరఫరాకు కారకులైన పది మందిని అరెస్ట్‌చేశారు. మద్యం ప్రధాన సరఫరాదారు ప్రభ్‌జీత్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. విచారణ సమయంలో ప్రభ్‌జీత్‌ సింగ్‌ కీలక సరఫరాదారు సాహబ్‌సింగ్‌ పేరును వెల్లడించాడు. మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఎక్సయిజ్, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో రెండు కేసులు నమోదుచేసి దర్యాప్తు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

 

నకిలీ మద్యం ఏరులై పారుతున్నా నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారంటూ ప్రభుత్వం వెంటనే మజీఠా డెప్యూటీ ఎస్పీ అమోలక్‌ సింగ్, మజీఠా పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అవతార్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేసింది. బాధిత కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి మాన్‌ సింగ్‌ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబంలోని చిన్నారులు చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం మాన్‌ అన్నారు. కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఆన్‌లైన్‌ నుంచి భారీగా మిథనాల్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఘటనకు కారకుడైన ప్రధాన నిందితుడు ప్రబ్జిత్‌ సింగ్‌ సహా 10 మందిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

Leave A Reply

Your Email Id will not be published!