India: ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్
ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్
India : పహాల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తదనంతం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై భారత్ ప్రశ్నిస్తూ… దాయాదిని ఇరుకునపెడుతోంది. ఐక్యరాజ్యసమితిలో(UN) సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఇటీవల ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి ప్రస్తావించారు. దీనిపై భారత్ దీటుగా బదులిచ్చింది.
India Slams
ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి పై వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ఐరాసాలో భారత(India) శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్… పాకిస్తాన్‌కు కౌంటరిచ్చారు. హరీశ్ మాట్లాడుతూ… ‘ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్(Pakistan) కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదు. పాక్ ప్రతినిధి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోంది.
26/11 ముంబై దాడుల నుంచి ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్ర దాడులు చేశారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరై నివాళులర్పించడం చూశాం. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు చేసింది. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకుంది. ఇలాంటి పనులు చేస్తూ బోధనలు చేయడం హాస్యాస్పదం అంటూ చురకలు అంటించారు.
India – ఉగ్రదాడుల్లో 20వేల మంది మృతి
‘‘65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్‌తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుంది. ఆరున్నర దశబ్దాల్లో పాకిస్థాన్ మూడు యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. వేల మంది ఉగ్రవాదులు మాపై దాడులు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్‌లో 20 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. భారత్‌లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోంది. ఒప్పందం జరిగినప్పటినుంచి ప్రాథమికంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. గత రెండేళ్లుగా ఒప్పందంలో సవరణలు చేయాలని పాక్‌ను భారత్ కోరినప్పటికీ.. దాయాది దేశం వాటిని తిరస్కరించింది. మా చట్టబద్ధమైన హక్కులు వినియోగించుకోవడానికి వీల్లేకుండా అవరోధాలు సృష్టించింది. వీటన్నింటిని సహించలేకే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశాం. ఉగ్రవాదానికి ఆ దేశం మద్దతునివ్వడం ఆపేసేవరకు ఇది కొనసాగుతోంది’’ అని హరీశ్ వివరించారు.
ఈసందర్భంగా ఇటీవల ఘర్షణల సమయంలో భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దాయాది దేశం దాడుల్లో 20 మందికి పైగా మృతి చెందగా… 80 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకొందని తెలిపారు. వాటిని మన బలగాలు సమర్థమంతంగా తిప్పికొట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన ఆ దేశం కపటత్వాన్ని ప్రదర్శిస్తూ బోధనలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని, వారికి ఆశ్రయం కల్పిస్తూ రక్షణ కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ పిలుపునిచ్చారు.
Also Read : Hindu Marriage: పుణెలో భారీవర్షం ! ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంట పెళ్లిళ్ళు !