Ethanol Factory: ఇథనాల్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన

ఇథనాల్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన

Ethanol Factory : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్‌ పరిశ్రమ(Ethanol Factory) ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కొంతకాలంగా 12 గ్రామాల ప్రజలు పరిశ్రమను వ్యతిరేకిస్తుండగా మంగళవారం గాయత్రి కంపెనీ వారు పరిశ్రమ ఏర్పాటుకు కూలీలను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆయా గ్రామాల రైతులు బుధవారం పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి చేరుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. అయినప్పటికీ రైతులు, మహిళలు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి వెళ్లి వారు వేసుకున్న టెంట్లను పీకేసి సామగ్రిని ధ్వంసం చేశారు. అలాగే అక్కడున్న కూలీలను రాళ్లతో తరిమికొట్టారు.

Farmers Protest on Ethanol Factory

దీనితో రంగంలోనికి దిగిన పోలీసులు… ఆందోళన కారులను అరెస్ట్ చేసారు. ఎవ్వరినీ కూడా ఇథనాల్ కంపెనీ(Ethanol Factory) పరిసరాల్లోకి రానీయకుండా గట్టి భద్రతను కల్పించారు. అయితే తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అరెస్ట్‌లు ఎలా చేస్తారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేసే స్థలానికి పలు గ్రామాల ప్రజలు చేరుకున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇథనాల్ కంపెనీ కోసం ఏర్పాటు చేసిన కంటైనర్‌కు నిప్పు పెట్టారు. పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇథనాల్ కంపెనీ వద్దంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శాంతియుతంగా చేసే నిరసనలకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇథనాల్ కంపెనీ వల్ల జరిగే అనర్ధాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అఖిలపక్షం నేతలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో చిత్తనూర్ వద్ద ఉండే ఇథనాల్ కంపెనీ నుంచి వచ్చే దుష్పరిణామాల నేపథ్యంలో రాజోలు వద్ద పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీని పెట్టవద్దంటూ చాలా రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా నిరసనలకు ప్రజలు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు చర్యలతో శాంతియుత నిరసనలు కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది.

Also Read : Food Poisoning: ఎర్రగడ్డ హాస్పిటల్ లో ఫుడ్‌ పాయిజన్‌ ! 70 మందికి అస్వస్థత !

Leave A Reply

Your Email Id will not be published!