Eknath Shinde: గొప్ప మనసు చాటుకున్న ఏక్‌నాథ్ షిండే  ! ఓ రోగికి తన చార్టెడ్ ప్లేన్‌ లో లిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం !

గొప్ప మనసు చాటుకున్న ఏక్‌నాథ్ షిండే  ! ఓ రోగికి తన చార్టెడ్ ప్లేన్‌ లో లిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం !

Eknath Shinde : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తన గొప్ప మనసు చాటుకున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కోసం ముంబై బయలుదేరిన ఓ పేషెంట్… తన ఫ్లైట్ మిస్సయింది. సీఎంఓ కార్యాలయం అధికారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)… తన చార్టెర్డ్ ప్లేన్‌ లో ఆమెను సకాలంలో ఆసుపత్రికి చేర్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

శీతల్ అనే మహిళకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ జరగాల్సి ఉంది. జల్‌గావ్‌ నుండి ముంబైకు ఫ్లైట్ టిక్కెట్స్ తీసుకున్న ఆమె… ఎయిర్ పోర్ట్ కు వచ్చేసరికి ఆలస్యం కావడంతో తన ఫ్లైట్ మిస్సయ్యింది. దీనితో బాధితురాలు చీఫ్ మినిస్టర్ మెడికల్ అసిస్టెన్స్ సెల్‌ ను సంప్రదించి సహాయం అర్థించింది. సకాలంలో ఆసుపత్రికి చేరకపోతే కిడ్నీని మరో పేషెంట్‌కు అమర్చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం మహిళకు ఆపన్న హస్తం అందించారు. అప్పటికి ఆయన చార్టడ్ విమానంలో ముంబైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సదరు మహిళ విషయం తెలియగానే ఆమెనూ తన విమానంలో తీసుకెళ్లారు. సకాలంలో ఆసుపత్రికి చేరుకునేలా చేశారు. ఇదే విషయాన్ని జల్‌గావ్ కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ తెలిపారు.

Eknath Shinde – అసలేం జరిగిందంటే ?

ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) జల్‌గావ్‌కు వచ్చారు. అనంతరం ఆయన మళ్లీ జల్‌గావ్ ఎయిర్‌పోర్టుకు తిరిగొచ్చేసరికి ఆలస్యమైంది. అప్పటికే పైలట్, కోపైలట్‌ ల డ్యూటీ అవర్స్ ముగిశాయి. దీనితో మళ్లీ అనుమతులు లభిస్తే తప్ప వారు విమానం నడపలేమని అశక్తత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మహిళా పేషెంట్ విషయం అధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఆర్‌డీ మంత్రి గిరీశ్ మహాజన్… సివిల్ ఏవియేషన్ అధికారులతో సంప్రదింపుల తర్వాత అనుమతులు లభించాయి. పైలట్‌లకు వైద్య పరీక్షల అనంతరం విమానం బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతరం, మహిళా రోగిని డిప్యూటీ సీఎం తన చార్టెడ్ ఫ్లైట్‌లో సకాలంలో ముంబైకి చేరేలా సహాయం అందించారు. అంతేకాక వారి కోసం ముంబయి విమానాశ్రయంలో ఆంబులెన్స్‌ను సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఏక్‌నాథ్ షిండేకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Vizianagaram Police: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న గ్యాంగ్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!