Air India: ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం ! వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం !

ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం ! వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం !

Air India : తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం బద్దలవడంతో… దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం దిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలోపెట్టుకొని… తూర్పు ఇండోనేషియాలోని (Air India) నుసా టెంగారా ప్రావిన్స్‌లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లు వెల్లడించారు.

తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని లెవోటోబి లకి-లకి పర్వతం మంగళవారం విస్ఫోటనం చెందడంతో… దాదాపు 11 కి.మీ. ఎత్తులో బూడిద ఎగసిపడినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్ళీ విస్ఫోటనం సంభవించడంతో 1 కి.మీ. ఎత్తులో దట్టమైన బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవీ హల్లన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరిసారిగా ఈ ఏడాది మేలో లకిలకి పర్వతం పలుమార్లు బద్దలయ్యిందని తెలిపారు.

Air India – నిర్వహణ సమస్యలతో రద్దయిన మరో ఎయిరిండియా విమానం

విమానాల మళ్లింపులు, దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు నిర్వహణ సమస్యలతో మంగళవారం ముంబయి నుంచి లఖ్‌నవూకు వెళ్లే ఎయిరిండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో బస ఏర్పాటుచేసి, బుధవారం వారిని తమ గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తున్నట్లు పేర్కొంది.

Also Read : Gold: అహ్మదాబాద్‌లో విమానం కూలిన చోట 70తులాల బంగారం సేకరణ

Leave A Reply

Your Email Id will not be published!