CM Devendra Fadnavis: రాహుల్ కు ‘మేకిన్ ఇండియా’ అంటే ఏంటో తెలియదు – సీఎం ఫడ్నవీస్
రాహుల్ కు ‘మేకిన్ ఇండియా’ అంటే ఏంటో తెలియదు - సీఎం ఫడ్నవీస్
CM Devendra Fadnavis : ‘మేకిన్ ఇండియా’ కాస్తా ‘అసెంబ్లింగ్ ఇండియా’గా మారిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన పోస్టుపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) మండిపడ్డారు. రాహుల్కు మేకిన్ ఇండియా అంటే ఏమిటో తెలియదన్నారు. అంతేకాకుండా మన దేశంలో ఏం తయారవుతుందో కూడా ఆయనకు తెలియదని ఆక్షేపించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… యూపీఏ ప్రభుత్వ హయాంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేదని, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక పదేళ్లలో దేశాన్ని ఐదో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని కూడా ఆయనకు తెలియకపోవచ్చని విమర్శించారు. రాబోయే రెండేళ్లలో దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని తెలిపారు. రాహుల్ కొంత హోం వర్క్ చేయాలని హితవు పలికారు.
CM Devendra Fadnavis Slams
ప్రధాని మోదీ నినాదాలివ్వడంలోనే ఆరితేరారని, దేశ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ‘మేకిన్ ఇండియా’ నినాదంతో మోదీ ఊదరగొడుతున్నా దేశంలో ఉత్పాదకత కనిష్ఠ స్థాయికి పడిపోయిందని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ‘మేకిన్ ఇండియా’ కాస్తా ‘అసెంబ్లింగ్ ఇన్ ఇండియా’గా మారిందని ధ్వజమెత్తారు. దిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ‘నెహ్రూ ప్లేస్’లో తాజాగా పర్యటించిన రాహుల్.. అక్కడ పనిచేసే టెక్నీషియన్లతో ముచ్చటించిన వీడియోను ఆయన షేర్ చేసుకున్నారు.
Also Read : Yogandhra: యోగా గ్రాండ్ సక్సెస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష
