Minister Hardeep Singh: హర్మూజ్‌ జలసంధి మూసివేతపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

హర్మూజ్‌ జలసంధి మూసివేతపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

Hardeep Singh : ఇరాన్‌ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఇరాన్ లో పరిస్థితి క్షీణించింది. దీనితో ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మూజ్‌ జలసంధిని మూసివేసేలా ఇరాన్‌ పార్లమెంటు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై ఆ దేశ భద్రతా మండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిని ఒకవేళ ఇరాన్‌ (Iran) మూసివేస్తే భారత్‌ పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ (Hardeep Singh) స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

Union Minister Hardeep Singh Comments

‘‘గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను మేం నిశితంగా గమనిస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో మనం గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించాం. మన సరఫరాలలో ఎక్కువ భాగం ఇప్పుడు హర్మూజ్‌ జలసంధి ద్వారా రావడం లేదు. మన చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనేక వారాల పాటు సరఫరాలు ఉండటంతో పాటు వివిధ మార్గాల నుంచి ఇంధన సరఫరాలు అందుతూనే ఉన్నాయి. మన పౌరులకు ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.

ఒమన్‌-ఇరాన్‌ మధ్య ఇరుకుగా ఉండే సముద్ర మార్గమే హర్మూజ్‌ జల సంధి. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, ఇరాక్‌, ఇరాన్‌ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ మార్గంలోనే రోజుకు దాదాపు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21 శాతానికి సమానం. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్‌ఎన్‌జీ (ద్రవరూప సహజ వాయువు) లోనూ 20% ఇక్కడ నుంచే సరఫరా జరుగుతోంది. ఈ నౌకలన్నీ హర్మూజ్‌ జలసంధి నుంచే రాకపోకలు సాగించాలి. భారత్‌ అవసరాల్లో 85% ముడి చమురు సౌదీ, ఇరాక్‌, యూఏఈ నుంచి రవాణా అవుతోంది. ఖతార్‌ నుంచి ఎల్‌ఎన్‌జీ కూడా ఈ మార్గంలోనే వస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో హర్మూజ్‌ జల సంధిని ఇరాన్‌ ఒకవేళ మూసేస్తే భారత్‌లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో కేంద్రమంత్రి పైవిధంగా స్పందించారు.

Also Read : Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు ! రియాద్‌ లో సురక్షితంగా ల్యాండింగ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!