MLA Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
MLA Raja Singh : తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక తీవ్ర గందరగోళం సృష్టించింది. తెలంగాణా రాష్ట్ర అధ్యక్షునిగా అధిష్టానం రామచంద్రరావును ఎంపిక చేసింది. దీనితో రామచంద్రరావు ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన… కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.
MLA Raja Singh Resign
రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా… బీజేపీ (BJP) అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే… వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజాసింగ్ మా పార్టీ సింబల్ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని, సస్పెండ్ చేయాలని కిషన్‌రెడ్డే స్పీకర్‌ను కోరాలి.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్ ప్రకటించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై అధిష్టానం సీరియస్
బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదని… రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలి. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నాం’’ అని బీజేపీ పేర్కొంది.
Also Read : Bhanakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం నిపుణుల కమిటీ
