PM Modi: దలైలామా శాంతికి రూపం – ప్రధాని మోదీ

దలైలామా శాంతికి రూపం - ప్రధాని మోదీ

PM Modi : టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా శాంతికి రూపమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘పవిత్ర ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదినం సందర్భంగా 140 కోట్ల మందితో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రేమ, కరుణ, ఓర్పు, నైతిక క్రమశిక్షణకు ఆయన బలమైన చిహ్నం. మతాలకు అతీతంగా ఆయనిచ్చే సందేశం ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

PM Modi Wish

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 90వ జన్మదిన శుభాకాంక్షలు. సమైక్యత, శాంతి, కరుణ సందేశాలతో ప్రపంచంలో ఆయన స్ఫూర్తిని నింపుతూనే ఉండాలి’’ అని తన సందేశంలో ఆకాంక్షించారు.

మరోవైపు 90వ పుట్టిన రోజు సందర్భంగా దలైలామా మాట్లాడుతూ ‘‘మానవతా విలువలు, మత శాంతి ప్రచారం చేయడానికి నేను కట్టుబడి ఉంటాను. టిబెట్‌ సంస్కృతి ప్రపంచానికి మానసిక ప్రశాంతత, కరుణను అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.

ఇటీవల తన వారసుడి ఎంపికపై దలైలామా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు నిండటంతో 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని… దానిని నిర్వహించే అధికారం గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఈమేరకు ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. 2011 సెప్టెంబర్‌ 24నే తాను టిబెట్‌ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి… తన వారసుడి ఎంపిక కొనసాగించాలా..? అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని చైనాను ఉద్దేశించి అన్నారు. దీంతో ఈ విషయం చైనాకు ఆగ్రహం తెప్పించింది. తమ ఆమోదముద్ర తప్పనిసరి అని తెల్చిచెప్పింది. మరో వైపు భారత్‌ మాత్రం లామాకు తమ మద్దతు ప్రకటించింది.

Also Read : Rahul Gandhi: బిహార్‌ కేరాఫ్ గూండాల రాజ్యం – రాహుల్‌ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!