YS Sharmila: వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులకు షర్మిల సంఘీభావం
వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులకు షర్మిల సంఘీభావం
YS Sharmila : వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. సీవోఏ(కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్) అనుమతులు లేకుండా విద్యార్థులను ఎలా తీసుకున్నారని వర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. గత వైసీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
YS Sharmila Shocking Comments
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల (YS Sharmila) మాట్లాడుతూ… ‘‘ఒక్కో విద్యార్థి రూ.15లక్షల మేర ఖర్చు పెట్టి చదివారు. ఐదేళ్ల కోర్సు పూర్తి చేసుకోబోతున్నారు. ఇలాంటి సమయంలో వాలిడేటెడ్ సర్టిఫికెట్ వస్తుందో లేదో తెలియదు. ఇది చాలా బాధాకరం. 2020లో యూనివర్సిటీని స్థాపించారు. అప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి ఇవ్వలేదు. తొలి బ్యాచ్‌లో చేరికలకు ప్రభుత్వం మభ్యపెట్టింది. ఇప్పటి వరకు తొలి బ్యాచ్ ఎన్రోల్మెంట్ కాలేదు. ఇలా ఎలా విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టారు. ఇది జగన్ మోహన్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి నిర్లక్ష్యం. ఇక్కడ అనుమతులు లేవని తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు?అధికారంలో ఉన్నప్పుడు అనుమతుల కోసం ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? సీవోఏ దిల్లీలోనే ఉంటుంది కదా… ఎంపీ అవినాశ్ ఎందుకు వారితో మాట్లాడలేదు ? అని ప్రశ్నించారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా? ఏడాదిగా సీవోఏ అనుమతులు కావాలని విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది… సీవోఏ దిల్లీలోనే ఉంది. కేంద్రప్రభుత్వాన్ని చేతుల్లో పెట్టుకొని ఈ చిన్న పనిని ఎందుకు పట్టించుకోట్లేదు? సర్టిఫికెట్ లేకుంటే విద్యార్థుల జీవితాలు ఏమవ్వాలి? చంద్రబాబు, పవన్, లోకేశ్ దీనికి సమాధానం చెప్పాలి. ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’’ అని వైఎస్ షర్మిల అన్నారు.
Also Read : Quantum Valley: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ
