Israel: మారువేషంలో భారత్‌ లో ఇజ్రాయెల్‌ మంత్రి కోవర్ట్ ఆపరేషన్‌

మారువేషంలో భారత్‌ లో ఇజ్రాయెల్‌ మంత్రి కోవర్ట్ ఆపరేషన్‌

Israel : ఇజ్రాయెల్‌ విదేశాంగమంత్రి మోషే దయాన్ మారువేషంలో భారత్‌లో పర్యటించారు. అత్యంత రహస్యంగా మారుపేరుతో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్, విదేశాంగమంత్రి అటల్ బిహరీ వాజ్‌పేయీతో భేటీ అయ్యారట. భారత్, ఇజ్రాయెల్ (Israel) రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు నెలకొల్పేందుకు ఆయన వచ్చారని… కానీ ఆ ప్రయత్నం విఫలమైందంటూ ఆనాటి సంఘటనను ‘బిలీవర్స్‌ డైలెమా: వాజపేయీ అండ్ హిందూ రైట్స్ పాత్ టు పవర్’ పుస్తకం వెల్లడించింది. గతంలో బెస్ట్‌ సెల్లర్‌ గా నిలిచిన అభిషేక్ చౌధరీ రాసిన పుస్తకం ‘వాజ్‌పేయీ: ది అసెంట్‌ ఆఫ్ హిందూ రైట్స్‌’కు సీక్వెల్‌గా దీనిని తీసుకువచ్చారు. ఇందులో కొన్ని ముఖ్య ఘట్టాలను మీడియా కథనాలు వెల్లడించాయి.

Israel Foreign Minister Syp Operation in India

1950లో ఇజ్రాయెల్‌ ను ఒకదేశంగా భారత్‌ గుర్తించింది. అయితే పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు మాత్రం 1992లోనే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 1977లో భారత్‌తో సంబంధాలను ఏర్పరచుకునేందుకు మోషే దయాన్‌ రహస్యంగా భారత్‌లో పర్యటించారు. ‘‘ఆగస్టు 14 మధ్యాహ్నం ఆయన దిల్లీకి వచ్చారు. మారువేషంలో, మారు పేరుతో తన పర్యటనను కొనసాగించారు. సప్దార్‌ గంఝ్‌ ప్రాంతంలో ఒక ప్రైవేటు ఇంట్లో ఆయనకు ఆతిథ్యం కల్పించారు. అలీనోద్యమ వ్యవస్థాపక దేశమైన భారత్‌ కు అందులో భాగంకాని ఇతర దేశాల్లోనూ పలుకుబడి ఉంది. అందుకే ఈజిప్టుతో శాంతి ప్రణాళికలకు మన దేశం మద్దతును ఇజ్రాయెల్ (Israel) ఆశించింది. అలాగే సుదీర్ఘకాలంగా అరబ్బులకు ఇస్తోన్న మద్దతు విషయంలోనూ మార్పు రావాలని కోరుకుంది’’ అని ఆ పుస్తకంలో రచయిత పేర్కొన్నారు.

భారత్‌ అభ్యర్థన మేరకు ఈ రహస్య సమావేశం జరిగింది. దేశాయ్‌, వాజ్‌పేయీకు మినహా దీని గురించి ఎవరికీ తెలియదు. దయాన్ పర్యటన విషయం బయటకు తెలిస్తే.. తమ సంకీర్ణ ప్రభుత్వం పడిపోతుందని మొరార్జీ దేశాయ్ భావించారట. ఇజ్రాయెల్‌తో (Israel) సంబంధాలు ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉండే వాజ్‌పేయీ కూడా ఆ సమావేశంలో ఇబ్బందిగా కనిపించారట. ఈ విషయాన్ని ఒక నెల తర్వాత అప్పటి దౌత్యవేత్త ఐ.కె.గుజ్రాల్‌తో దేశాయ్‌ వెల్లడించారని రచయిత పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొన్న తర్వాతే ఇజ్రాయెల్‌తో దౌత్యసంబంధాలు పరిగణనలోకి తీసుకుంటామని దయాన్‌తో అప్పటి ప్రధాని తేల్చిచెప్పారు. పాలస్తీనాకు మనదేశం పూర్తి మద్దతుదారుకావడంతో.. కనీసం దిల్లీలో ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయాన్ని తెరవడానికి అంగీకరించలేదు.

తాను అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో దయాన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వెళ్లిపోయేప్పుడు అతిథులు ఇచ్చిన గిఫ్ట్‌ను తీసుకోవడానికి కూడా నిరాకరించారు. పైగా భారత్‌ పేదరికాన్ని, మన నాయకులను తీరును అపహాస్యం చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. ఎమర్జెన్సీ పిరియడ్ అనంతరం కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావడంతో ఇతర పక్షాలతో కలిసి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 1979 వరకు 856 రోజులు అధికారంలో ఉంది. ఆ సంకీర్ణ ప్రభుత్వం అప్పటి విదేశాంగ విధానాన్ని మార్చాలనే భావించకపోవడమూ దయాన్‌ ప్రయత్నం విఫలం కావడానికి కారణమై ఉండొచ్చని రచయిత అభిప్రాయపడ్డారు.

Also Read : PM Narendra Modi: ఈ నెల 25న మాల్దీవులకు ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!