Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. 2024 నుంచి ఇప్పటివరకు బీజాపుర్ జిల్లాలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్‌లలో 185 మంది మావోయిస్టులు హతమయ్యారని, 803 మంది అరెస్టు కాగా.. 431 మంది లొంగిపోయారన్నారు.
Chhattisgarh – పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు
బీజాపూర్ (Bijapur) జిల్లాలో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదుట 25 మంది లొంగిపోయారు. వీరిపై రూ.1.15 కోట్ల మేర రివార్డు ఉన్నట్టు ఐజీ వెల్లడించారు. ప్రోత్సాహకంగా వారికి రూ.50 వేల చొప్పున చెక్కులు అందజేశారు.
కాంకేర్ జిల్లా ఎస్పీ కల్యాణ్ ఎలిసెల ఎదుట 13 మంది లొంగిపోయారు. వీరిలో మిలటరీ కంపెనీ కమాండర్ మంగులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిపై రూ.62 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
సుక్మా ఎస్పీ కిరణ్ జవాన్ ఎదుట ఐదుగురు లొంగిపోయారు. వీరిపై రూ.6 లక్షల రివార్డు ఉంది. వారిలో కొంతమంది గతంలో పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
నారాయణపూర్ ఎస్పీ రాబిన్‌సన్ గుడియా ఎదుట నలుగురు మహిళా మావోయిస్టులు సహా ఎనిమిది మంది లొంగిపోయారు. వీరిలో కమాండర్ కమలేశ్ ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరందరిపై రూ.33 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
Also Read : INDIA: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని రంగంలోనికి దించే యోచనలో ఇండియా కూటమి
