Minister Vangalapudi Anitha: వరి నాట్లు వేసిన హోం మంత్రి వంగలపూడి అనిత

వరి నాట్లు వేసిన హోం మంత్రి వంగలపూడి అనిత

Vangalapudi Anitha : ఆమె రాష్ట్రానికి హోం మంత్రి. విజయనగరం జిల్లాకు ఇన్చార్జి మంత్రి కూడా. అయినప్పటికీ తన హోదాను పక్కన పెట్టి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా పొలంలోకి దిగారు. బురదలో అడుగులు వేస్తూ, స్వయంగా తన చేతితో వరి నాట్లు నాటారు. వ్యవసాయ కూలీలతో పాటు ఉబాల్లో పాలు పంచుకున్నారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆమె ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha). శనివారం గజపతినగరం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ‘అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌’ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గజపతినగరం మండలం బంగారమ్మ పేటలో ఆమె రైతులతో కలిసి వరి నాట్లు వేసారు.

మోకాళ్ల వరకు కూరుకుపోయే దమ్ము మడిలో మంత్రి అనిత (Vangalapudi Anitha) అతికష్టం మీద కూలీల చేయి పట్టుకొని అడుగుతీసి అడుగు వేస్తూ, వారి కష్టాలను తెలుసుకుంటూ స్వయంగా వరినాట్లను వేయడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక ఎకరం పొలంలో నాట్లు వేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత మంది పని చేస్తారు, రోజుకు ఎంత కూలీ సంపాదిస్తారు… తదితర విషయాలను మంత్రి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగారురాజు, జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు, ఇతర అధికారులు, ప్రజాప్రతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు

Vangalapudi Anitha – జగన్‌కు కేజీకి, టన్నుకు తేడా తెలియదు – మంత్రి అనిత

పొగాకు రైతుల దగ్గరికి వెళ్లిన జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan) కేజీకి, టన్నుకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి అనిత ఆరోపించారు. మామిడి రైతుల దగ్గరికి వెళ్లి… మామిడి కాయలు తొక్కించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. శనివారం గజపతినగరం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ‘అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌’ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల విషయంలో రాజకీయం చేయరాదని హితవు పలికారు. రాజకీయం చేసేందుకు వైసీపీ నాయకులు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం రైతు కుటుంబాలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే… ఉద్దేశపూర్వకంగానే అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం అంటే సీఎం చంద్రబాబుకు చాలా ఇష్టమని, రీ సర్వేలో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతన్నలు సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైతాంగాని మంచి రోజులు వచ్చాయని మంత్రి అనిత (Vangalapudi Anitha) పేర్కొన్నారు.

రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెడుతూ, సూపర్ సిక్స్ లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. విత్తనం నాటిన ద‌గ్గ‌ర‌నుంచి పంట కోసి ఇంటికి చేర్చేవరకు రైతుకు అన్ని విధాలా ప్ర‌భుత్వ ప‌రంగా సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తున్నామన్నారు. విజ‌న్ ఉన్న నాయకుడు చంద్ర‌బాబు నాయ‌కత్వంలో రైత‌న్న‌కు అన్నివిధాలా భ‌రోసా అందుతోంద‌ని చెప్పారు. రైతులకు ఆధునిక పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా, డ్రోన్ల ద్వారా సాగుకు సహకారాన్ని ఇస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. రైతులు సేంద్రీయ వ్య‌వ‌సాయాన్ని పెంచేందుకు ముందుకు రావాల‌ని కోరారు. రీ సర్వేలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక సెల్ ను, టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు.

Also Read : Minister Nitin Gadkari: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు

Leave A Reply

Your Email Id will not be published!