Minister Uttam Kumar Reddy: బనకచర్లపై ఎంతవరకైనా పోరాడతాం – మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బనకచర్లపై ఎంతవరకైనా పోరాడతాం - మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Uttam Kumar Reddy : ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాల మేరకే బనకచర్ల (Banakacherla) అనుమతులను సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించాయన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అభ్యంతరాలతో కేంద్రం పర్యావరణ అనుమతులు నిలిపివేసిందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొన్నారు.
Minister Uttam Kumar Reddy Key Comments
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల దిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్లపై తమ వాదనలు గట్టిగా వినిపించామని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టం, 1980-గోదావరి నదీజలాల పంపిణీ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇవన్నీ తెలిసిన భారత రాష్ట్ర సమితి నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.
కేసీఆర్ మాటలతోనే ఏపీ ‘బనకచర్ల’ చేపట్టింది – మహేశ్‌కుమార్ గౌడ్
మాజీ సీఎం కేసీఆర్ మాటలతోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. గోదావరిలో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని, వాటిని ఏపీ వాడుకోవచ్చని గతంలో కేసీఆర్ అన్నారని… అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందని చెప్పారు. తెలంగాణను వదిలేసి రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న జనహిత పాదయాత్ర సందర్భంగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. కులగణన కోసం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పోరాటం చేశారు. ఆయన కోరిక మేరకు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో కులగణన చేపట్టారు. అలాంటిది ఇప్పుడు బీసీలపై కవిత ప్రేమ ఒలకబోస్తున్నారు.’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్కతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Also Read : Tejashwi Yadav: బిహార్ ఓటర్ల జాబితాలో నా ఓటు లేదు – తేజస్వీ యాదవ్
