Rahul Gandhi: SIR అసలు రంగును బయటపెడతాం – రాహుల్‌ గాంధీ

SIR అసలు రంగును బయటపెడతాం - రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : బీహార్‌ లో ఓట్ల చోరీ జరిగిందని ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. బీహార్‌లో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ద్వారా ఉన్న ఓటర్లను తొలగించి కొత్త వారిని చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దేశం ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. బీజేపీ నేతలు ప్రెస్‌మీట్‌ పెడితే ఈసీ అఫిడవిట్‌ అడగలేదని, తాను ప్రెస్‌మీట్‌ పెడితే అఫిడవిట్‌ ఈసీ అడుగుతోందని విమర్శించారు. ఓటర్ల డేటాను అడిగినా ఈసీ ఇంతవరకూ ఇవ్వలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు.

Rahul Gandhi Shocking Comments on SIR

మీ ఓట్లను దొంగిలించి… ఎన్నికల్లో గెలిచి దేశ సంపదను సంపన్నులకు అందిస్తున్నారని మండిపడ్డారు. బీహార్‌లో చేస్తున్న SIR అసలు రంగు బయటపెడతామని రాహుల్‌ హెచ్చరించారు. కాగా, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) మరోసారి విచారించిన సుప్రీంకోర్టు… ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో… ఆ 65లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది.

అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్‌లోకి తీసుకురావాలని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం(ఆగస్టు 14వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం​ ప్రశ్నించింది. బూత్‌ లెవెల్‌ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘భారత ఎన్నికల కమిషన్ వాదనలను మేము పూర్తిగా విన్నాం. విచారణ సమయంలో, ఈ క్రింది దశలను అంగీకరించారు. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ, తాజాగా జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్‌సైట్‌లలో ప్రదర్శించాలి’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

మోదీ చాలా ప్రమాదకారి – ఖర్గే

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శుక్రవారంనాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రశంసించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ప్రధాన మంత్రి ‘చాలా ప్రమాదకర వ్యక్తి’ అని, ఆయనను అధికారం నుంచి తొలగించాలని అన్నారు. బీహార్‌లోని సాసారాంలో ఆదివారంనాడు జరిగిన విపక్ష ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, బీజేపీని అధికారం నుంచి తొలగించేంత వరకూ ప్రజల ఓట్లు, హక్కులు, స్వేచ్ఛకు, చివరకు రాజ్యాంగానికి కూడా భద్రత లేదని అన్నారు.

దేశ స్వాతంత్య్రానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని, అలాంటి వ్యక్తులను ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి పొడగటం ఏమిటని ఖర్గే ప్రశ్నించారు. ‘మీ వాళ్లెవరూ జైలుకు (స్వాతంత్ర్య పోరాటంలో) వెళ్లలేదు. ఉద్యోగాలు కావాలంటూ మీవాళ్లు బ్రిటిష్ వారికి దరఖాస్తులు చేసుకున్నారు. మేము వాళ్లతోనే ఉంటామని కూడా తెగేసి చెప్పారు. అలాంటి వ్యక్తుల పేర్లను ఎర్రకోట నుంచి ప్రధాని ప్రస్తావించడమంటే దేశ స్వాతంత్ర్య కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మలకు మీరెలాంటి సమాధానమిస్తారు’ అని ఖర్గే నిలదీసారు. ఆ కారణంగానే ఆయన (మోదీ) చాలా ప్రమాదకరమైన వ్యక్తని తాను చెప్పగలనని అన్నారు. ప్రధాని మోదీని గద్దె దింపేంత వరకూ, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు ఉంటుందని ఖర్గే అన్నారు. ప్రజల ఓట్లు, యువత ఉద్యోగాలు, రైతుల నుంచి ఎంఎస్‌పీని మోదీ దోచుకుంటున్నారని విమర్శించారు.

Also Read : Election Commission: ఎన్నికల్లో వివక్షకు తావులేదు, మాకు అన్నీ పార్టీలూ సమానమే – ఈసీ

Leave A Reply

Your Email Id will not be published!