Telangana Floods: తెలంగాణలో 2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం
తెలంగాణలో 2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం
Telangana Floods : తెలంగాణలో భారీ వర్షాల కారణంగా 270 మండలాలు, 2,463 గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వర్షాలతో వరి, పత్తి, మొక్కజొన్న, టమాట, కంది పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. మొత్తం 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లాలవారీగా పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. నివేదిక ప్రకారం… 1,09,626 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి, 6,751 ఎకరాల్లో సోయాబీన్, 639 ఎకరాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Telangana Floods – భారీ వర్షాలకు కకావికలమైన కామారెడ్డి
కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు కకావికలం చేసాయి. కామారెడ్డి (Kamareddy) పట్టణంతోపాటు రాజంపేట, భిక్కనూరు, దోమకొండ మండలాల్లో జనజీవనం స్తంభించింది. రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో 24 గంటల్లో అత్యధికంగా 44 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో 20 సెం.మీ. మేర వర్షం కురిసింది. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని పెద్దచెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్ కు వెళ్లే మార్గంలోని పైవంతెన మీది నుంచి నీరు ప్రవహించింది. సిరిసిల్ల మార్గంతోపాటు నిజాంసాగర్ మార్గంలోనూ రోడ్లు ధ్వంసమవడంతో పట్టణానికి మూడు వైపులా రాకపోకలకు ఆటంకం కలిగింది. పెద్దచెరువు అలుగుతో కిందనున్న జీఆర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పదుల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.
Telangana Floods – కామారెడ్డి పట్టణం హౌసింగ్‌బోర్డు కాలనీ-జీఆర్ కాలనీ మధ్య నీట మునిగిన కార్లు
భిక్కనూరు- తలమడ్ల స్టేషన్ల మధ్యలో రామేశ్వరపల్లి గ్రామశివారులో వరద ఉద్ధృతికి రైల్వేకట్ట తెగింది. రైల్వేట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయాయి. దీంతో నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో రైళ్లు నిలిచాయి. జాతీయ రహదారి 44పై భిక్కనూరు టోల్గేట్ వద్ద ఎడ్లకట్ట వాగు ప్రవాహం చేరడంతో పాక్షికంగా రోడ్డు దెబ్బతింది. భిక్కనూరు వద్ద రహదారిపై 20 కి.మీ.కు పైగా వాహనాలు గంటల తరబడి నిలిచాయి. అధికారులు వారికి ఆహారంతోపాటు తాగునీరు సమకూర్చారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద నిజామాబాద్ వెళ్లే మార్గంలో గురువారం జాతీయ రహదారి కుంగిపోయింది. టేక్రియాల్ వద్ద పెద్దచెరువు ప్రవాహంతో ఒకవైపు మొత్తం జాతీయ రహదారి కుంగింది. జిల్లావ్యాప్తంగా 130 రోడ్లు ధ్వంసమయ్యాయి.
Telangana Floods – వాతావరణం అనుకూలించక వెనుదిరిగిన సీఎం
కామారెడ్డిలో వరదల పరిస్థితి సమీక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి గురువారం బయలుదేరినప్పటికీ ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు.
నిర్మల్, ఆదిలాబాద్‌లలో మునిగిన కాలనీలు
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేట, వాడి గ్రామాల్లో చెరువు కట్టలు తెగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామ ప్రజలను వరద నీరు చుట్టుముట్టింది. రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి ఒడ్డున ఉన్న ఆశ్రమంలోకి నీరు చేరడంతో సాధువుల్ని, పశువుల్ని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఇప్పకాయల వినయ్‌కుమార్(28) ఇంటి గోడ కూలి మృతిచెందారు. ఈయన గుండారంపల్లె దవాఖానాలో వైద్యుడిగా పని చేస్తున్నారు. తన ఇంట్లోకి నీళ్లు రావడంతో… రంధ్రం చేస్తుండగా గోడ కూలి పైన పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. బీబీపేట జనగామ గ్రామానికి చెందిన కప్పెర రాజిరెడ్డి(60) బుధవారం సాయంత్రం ఎడ్లకట్టవాగులో గల్లంతయ్యారు. గురువారం ఆయన మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం వెలికితీశారు. జిల్లావ్యాప్తంగా 50కి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. రెండు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో 14 ఆపరేషన్లు నిర్వహించి 775 మందిని కాపాడాయి.
కుండపోత వర్షాలతో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. శ్రీరామసాగర్, స్వర్ణ ప్రాజెక్టుల నుంచి ఒకేసారి వరద నీరు దిగువకు వదలటంతో నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ, ఇందిరానగర్, బోయవాడ, నటరాజ్‌నగర్, భాగ్యనగర్, ప్రియదర్శినీ నగర్, శాంతినగర్ కాలనీల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. ప్రధాన వాణిజ్య ప్రాంతమైన శివాజీచౌక్‌లో భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలను పోలీసులు దారిమళ్లించారు.
Also Read : MP Mahua Moitra: అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి – ఎంపీ మహువా సంచలన వ్యాఖ్యలు
