YS Sharmila: అన్నమయ్య ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చూపాలి – వైఎస్ షర్మిల

అన్నమయ్య ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చూపాలి - వైఎస్ షర్మిల

YS Sharmila : గత వైసీపీ, నేటి కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్టును ‘అనాథ ప్రాజెక్టు’గా మార్చాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ప్రాజెక్టు కొట్టుకుపోయి ఐదేళ్లు దాటినా పునర్‌నిర్మాణానికి దిక్కులేదన్నారు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదని మండిపడ్డారు. ఐదు గ్రామాలు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇవ్వలేదని విమర్శించారు.

YS Sharmila Key Comments on Annamayya Project

‘‘గత సీఎం జగన్‌ రూ.800 కోట్లతో మరమ్మతులు అంటూ హడావుడి తప్పా ప్రాజెక్టును కట్టింది లేదు. పునరుద్ధరణ పేరుతో మూడేళ్లు గడిపారే తప్ప తట్టెడు మట్టి వేయలేదు. బాధిత కుటుంబాలకు ఇళ్లు అందలేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేస్తాం, దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన తప్ప జగన్‌ చేసింది ఏమీలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రాజెక్టు కడతామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. రాజంపేటకు రెండు సార్లు వచ్చిపోయినా ప్రాజెక్టు పనులకు మోక్షం లేదు. రూ.340 కోట్లతో మరమ్మతులు అని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు. రాజంపేట వేదికగా మళ్లీ మాయమాటలు చెప్పారు తప్పిస్తే ప్రాజెక్టు నిర్మాణంపై దిశా-నిర్దేశం లేకపోవడం శోచనీయం. అన్నమయ్య కన్నీటి వ్యధకు శాశ్వత పరిష్కారం చూపాలి. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి. సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలి. కాంగ్రెస్‌ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం’’అని షర్మిల (YS Sharmila) అన్నారు.

కడప పర్యటనకు వచ్చిన ఏపీసీసీ చీఫ్‌ షర్మిలను చూసేందుకు ఓ దివ్యాంగుడు కర్నూలు నుంచి వచ్చాడు. ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేశాడు. ఆ ఫొటోను షర్మిల సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అభిమానానికి అంగవైకల్యం అడ్డు కాదని తమ్ముడు సంజీవ్‌ను చూస్తే అర్థమవుతోందన్నారు. వైఎస్సార్‌ మీద తమ్ముడికి ఉన్న ప్రేమ కనిపించిందని చెప్పారు. తమలాంటి దివ్యాంగుల జీవితాల్లో వికాసం రావాలంటే కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని, వైఎస్సార్‌ సంక్షేమ పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని తమ్ముడు చెప్పిన మాటలు నూతన ఉత్తేజాన్ని కలిగించాయని పోస్టులో పేర్కొన్నారు.

Also Read : MLC Kavitha: హరీశ్‌ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!