PM Narendra Modi: జీఎస్టీ 2.0 పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
జీఎస్టీ 2.0 పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
Narendra Modi : ఆత్మనిర్భర్ భారత్ దిశగా చేపట్టిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ (GST) సంస్కరణలతో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో సమాజంలోని అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, ఇది బచత్ ఉత్సవం అని అభివర్ణించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు దేవీనవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభమవుతోందని, పేద మధ్య తరగతి వర్గాలకు ఇది డబుల్ బొనంజా అని అభివర్ణించారు. జీఎస్టీ (GST) మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.
PM Narendra Modi Key Comments
కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా చేసిన కృషితో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారని ప్రధాని చెప్పారు. నియో-మిడికల్ క్లాస్‌గా ఉండే ఈ 25 కోట్ల మంది ప్రజలు భారతదేశ వృద్ధి కథలో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియని, దేశ అవసరాలు కాలాన్ని బట్టి మారుతుంటాయని, దేశ ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ కలలను దృష్టిలో ఉంచుకుని తాజా జీఎస్టీ (GST) సంస్కరణలు తెచ్చామని చెప్పారు. రేపట్నించి కేవలం 5, 18 శాతం శ్లాబులు మాత్రమే అమల్లోకి వస్తాయని, దీంతో ప్రతి వస్తువు ధర తగ్గుతుందని చెప్పారు. ఆహార పదార్థాలు, ఔషధాలు, సబ్బులు, బ్రష్, పేస్ట్, హెల్త్ అండ్ ఇన్స్యూరెన్స్, ఇంకా పలు వస్తువులు సేవలు జీరో టాక్స్ లేదా 5 శాతం పన్నుకే పరిమితమవుతాయని చెప్పారు.
సరికొత్త చరిత్ర సృష్టించేందుకు జీఎస్టీ మార్పులు సహకరిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో దేశంలో రకరకాల పన్నులతో ప్రజల్లో గందరగోళం ఉండేదని, జీఎస్టీ ఆ గందరగోళం నుంచి బయటపడేసిందని చెప్పారు. రేపట్నించి నిత్సావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని, కొత్త జీఎస్టీ వల్ల ఉత్పత్తిదారులు, వినియోగదారలకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. 12 శాతం పన్ను ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం పన్నులోకి వచ్చాయని, పేదలు వాడే అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు.
సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని, అదే విధంగా దేశ ప్రజల పొదుపు కూడా పెరుగుతుందని మోదీ చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే ఇంత పెద్ద సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోందని, వారికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పారు. పర్యాటక రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. హోటల్స్ సేవలపైనా జీఎస్టీ తగ్గించామని తెలిపారు. సంస్కరణలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తాయని చెప్పారు. జీఎస్టీ తగ్గింపులతో ఎంఎస్ఎంఈలు లాభపడతాయన్నారు. ప్రధాని మంత్రి ఈ సందర్భంగా మరోసారి మేడిన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం సమృద్ధిగా ఉండాలంటే దేశీయ ఉత్పత్తులే వాడాలని సూచించారు. మన ఉత్పత్తుల నాణ్యత దేశ గౌరవాన్ని మరింత పెంచుతోందని, నాగరిక్ దేవోభవన అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
Also Read : Ex MLC Kavitha: నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను – కవిత
