Sammakka Sagar Project: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ గ్రీన్ సిగ్నల్
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ గ్రీన్ సిగ్నల్
Sammakka Sagar Project : తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం కలిశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు (Sammakka Sagar Project) నిర్మాణానికి నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయాలని ఆయన్ను కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే ప్రాంతానికి పరిహారం ఇస్తామని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీనితో ఈ ప్రాజెక్టుకు ఎన్‌వోసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో తెలంగాణ తరఫున ఆయనకు ఉత్తమ్ ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌వోసీపై చర్చించేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరుతూ సీఎం విష్ణుదేవ్ సాయ్‌కు ఇటీవల ఉత్తమ్ లేఖ రాసిన విషయం తెలిసిందే.
Sammakka Sagar Project Updates
తెలంగాణలో నీటి లభ్యతను పెంచేందుకు గోదావరిపై 6.7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు వెనుక జలాల వల్ల ఛత్తీస్‌గఢ్‌లో కొంత భూభాగం ముంపునకు గురవుతోంది. ముంపు ప్రాంతంలో భూసేకరణ, పరిహారం చెల్లించే విషయంపై ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఇదే అంశంపై ఎన్‌వోసీ జారీలో సీఎం సహకారం గురించి ఉత్తమ్ ఇటీవల ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు.
ములుగు జిల్లాలో 6.7 టీఎంసీ సామర్థ్యంతో ఈ సమ్మక్క సాగర్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ, వరంగల్‌లో తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. రామప్ప–పాకాల లింక్ కెనాల్ కింద కొత్తగా 12,146 ఎకరాలకు నీరు అందుతుంది. వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. 90 కిలోమీటర్ల టన్నెల్ నెట్‌వర్క్‌తో భారీ ఇంజనీరింగ్ డిజైన్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మూడు పంప్‌హౌసులు, క్రాస్ డ్రెయినేజ్ వర్క్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 73 హెక్టార్ల భూభాగం నీటిమునిగే అవకాశం ఉన్నందున దానికి పరిహారం, పునరావాసం భరించేందుకు తెలంగాణ సిద్ధం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. ఐఐటీ ఖరగ్‌పూర్ సబ్‌మెర్జెన్స్ స్టడీ ఫైండింగ్స్ అమలు చేస్తామని కూడా ఉత్తమ్ తెలియజేశారు. ఎన్ఓసీ జారీకి ముందే అడ్వాన్స్ చెల్లింపులు ఇవ్వడానికి కూడా తెలంగాణ సిద్ధమవడంతో ఇది సాకారమైంది.
Also Read : CM Rekha Gupta: నా రీల్స్ చూడటం ఆపండి – కేజ్రీవాల్‌కు ఢిల్లీ సీఎం చురక
