Amit Shah: సామ్రాట్ ‘బిగ్ మ్యాన్’ అవుతారు – అమిత్ షా
సామ్రాట్ ‘బిగ్ మ్యాన్’ అవుతారు - అమిత్ షా
Amit Shah : బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీకి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సామ్రాట్‌ను మోదీ ‘బిగ్ మ్యాన్’ చేస్తారని అన్నారు. సామ్రాట్ పోటీ చేస్తున్న తారాపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ను తప్పించి, బీజేపీ అభ్యర్థికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఎన్డీయే ప్రయత్నాలు చేస్తోందని గతంలో విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Amit Shah Comments
‘‘సామ్రాట్ చౌధరీ పుట్టింది ఇక్కడే. సామ్రాట్ కోసం ఈ స్థానాన్ని వదులుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే (జేడీయూ) రాజీవ్ సింగ్‌ను ఒప్పించాము. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని తారాపుర్ సహా అనేక ప్రాంతాల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే మాత్రం రెడీమేడ్ డిప్యూటీ సీఎం’’ అని అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికల్లో సామ్రాట్‌కు ఓటు వేసి గెలిపించాలని, రానున్న రోజుల్లో ఆయన్ను ప్రధాని మోదీ ‘‘బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్’’ చేస్తారని చెప్పారు.
బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌధరీ.. గతంలో జేడీయూ, ఆర్జేడీ పార్టీల్లోనూ పనిచేశారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఆయన క్రమంగా ఎదుగుతూ వచ్చారు. సామ్రాట్ కుష్వాహా వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ వర్గానికి చేరువయ్యే వ్యూహంలోనే సామ్రాట్‌కు భాజపా ప్రాధాన్యం కల్పిస్తోందనే వాదన కూడా ఉంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన.. చాలాకాలం తర్వాత ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.
Also Read : BPCL: కుమార్తె చావులో అధికారుల కాసుల వేటపై మాజీ సీఎఫ్‌ఓ ఆవేదన
