Rahul Gandhi: హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

 

 

 

బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలతో పాటు ‘హెచ్’ ఫైల్స్‌ను బహిర్గతం చేశారు. హర్యానాలో 25,41,144 లక్షల ఓటు చోరీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘మా దగ్గర ‘హెచ్‌’ ఫైల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాం. హర్యానాలోని మా అభ్యర్థులు.. ఏదో తప్పు జరిగిందంటూ ఫిర్యాదులు విరివిగా చేశారని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ‘హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల ఓట్లు నకిలీవే’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన బృందం 5.21 లక్షల డూప్లికేట్ ఓటన్లు గుర్తించిందని అన్నారు. హర్యానాలోని ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీనేనని స్పష్టం చేశారు. తన ఆరోపణలపై ఓ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఒక బ్రెజిల్ నటి ఫొటోతో, సీమా, స్వీటీ, సరస్వతి వంటి పలు పేర్లతో ఏకంగా 22 సార్లు నకిలీ ఓట్లు వేశారని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌ను నిర్వహిస్తోందని రాహుల్‌ ఆరోపించారు.

 

ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచన అని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!