Reverse Migration: ‘ఎస్‌ఐఆర్‌’ ఎఫెక్ట్‌ బెంగాల్‌ నుంచి బంగ్లాదేశీయుల ఇంటిబాట

‘ఎస్‌ఐఆర్‌’ ఎఫెక్ట్‌ బెంగాల్‌ నుంచి బంగ్లాదేశీయుల ఇంటిబాట

Reverse Migration : ‘హకీంపుర్‌’.. పశ్చిమ బెంగాల్‌లో భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దులోని ఈ ప్రాంతంలో చరిత్ర పునరావృతమవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, రివర్స్‌ డైరెక్షన్‌లో. 1947లో దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో ఆ దేశం నుంచి వేలాది మంది శరణార్థులు సరిహద్దు దాటి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అనేక మంది స్వదేశం బాట పడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Reverse Migration From West Bengal

‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఏళ్ల క్రితం హకీంపుర్‌లో స్థిరపడిన, సరైన పత్రాలు లేని బంగ్లాదేశ్ (Bangladesh) జాతీయులు నవంబరు ప్రారంభం నుంచి స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ ఆధార్‌, ఓటరు కార్డులు, అసలు పత్రాలే లేకుండా నివసిస్తున్నవారు.. ఇక తప్పించుకోలేమన్న భావనతో ఎన్నికల సిబ్బంది ఇళ్లకు వచ్చేలోపే తిరిగి వెళ్లిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమ ఇంటి పెద్దలు వచ్చిన హకీంపుర్‌ బార్డర్‌ అవుట్‌పోస్ట్‌ దారిలోనే తిరుగు ప్రయాణమవుతున్నారు.

ఇక్కడి అక్రమ చొరబాటుదారులు చాలావరకు బంగ్లాదేశ్‌లోని ఖుల్నా, సత్ఖిరా, జశోర్, బగెర్హట్‌ తదితర ప్రాంతాలకు చెందిన దినసరి కూలీలే. పనుల కోసం చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించామని, తమవద్ద పత్రాలు లేవని చాలామంది బహిరంగంగా అంగీకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. 1971 సమయంలో శరణార్థులకు ఆశ్రయం కల్పించిన ఇక్కడి గ్రామస్థులు.. ప్రస్తుత పరిణామాలను అసాధారణమైనవిగా పేర్కొన్నారు. అప్పట్లో మాదిరిగానే.. ఇప్పుడు కూడా వీరికి ఆహారం, చాయ్‌ వంటివి అందిస్తున్నారు.

బంగ్లాదేశ్‌కు స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోతున్నవారి సంఖ్య నవంబరు రెండో వారం నుంచి ఒక్కసారిగా పెరిగినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితులను వారు ‘ఎస్‌ఐఆర్‌’తో ముడిపడి పెడుతున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎంతమంది తిరిగి వెళ్లారనే వివరాలపై స్పష్టత లేదు. మరోవైపు ఈ పరిణామాల గురించి తెలుసుకున్న బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద్‌ బోస్‌.. హకీంపుర్‌ బీఎస్‌ఎఫ్‌ బార్డర్‌ అవుట్‌ పోస్ట్‌ వద్ద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని తెలిపారు.

Also Read : CJI Surya Kant: నూతన సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌  ! తొలిరోజు 17 కేసుల విచారణ !

Leave A Reply

Your Email Id will not be published!